హెచ్చరికలు జారీ చేసిన చైనా

- March 20, 2018 , by Maagulf
హెచ్చరికలు జారీ చేసిన చైనా

బీజింగ్: తమ భూభాగంలోని ఒక్క ఇంచు స్థలాన్ని కూడా వదులుకోవడానికి చైనా సిద్ధంగా లేదని, తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యుద్ధానికైనా సిద్ధమేనని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన భూమి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా స్వాధీనం చేసుకుంటామని భారత్ సహా పలు సరిహద్దు దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. చైనా పార్లమెంట్ వార్షిక సమావేశాల ముగింపు సందర్భంగా మంగళవారం జిన్‌పింగ్ ప్రసంగించారు. 130 కోట్ల మంది చైనావాసుల పునర్నిర్మిత చైనా ఆశలకు త్వరలో వాస్తవరూపం కల్పిస్తామన్నారు. చైనీయులు అజేయులు, పట్టు విడువని వారు. శత్రువులతో యుద్ధం చేసైనా మన భూభాగాలను స్వాధీనం చేసుకునే సత్తా మనకు ఉన్నది అని పేర్కొన్నారు. మాతృభూమి సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ పునరేకీకరణ సాధించాలన్న దేశప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామంటూ తైవాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తైవాన్ తమ పరిధిలోకే వస్తుందని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. వన్‌బెల్ట్..వన్‌రోడ్, ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులపై వస్తున్న విమర్శలకు స్పందించిన జిన్‌పింగ్ తమకు విస్తరణ కాంక్ష లేదని చెప్పారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ చెప్పిందే శాసనమని, 20 లక్షల మంది సైన్యం, ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు పార్టీ నాయకత్వంలోనే పనిచేయాలని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. భారత్ సహా పలు దేశాలతో కయ్యం పెట్టుకుంటున్న చైనా ఇప్పుడు ఏకంగా అవసరమైతే యుద్ధం చేస్తామంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com