జీశాట్‌ 6ఏ శాటిలైట్‌తో లింక్‌ కట్‌: ఇస్రో

- April 01, 2018 , by Maagulf
జీశాట్‌ 6ఏ శాటిలైట్‌తో లింక్‌ కట్‌: ఇస్రో

ఉపగ్రహ ప్రయోగాల్లో అనేక రికార్డులను సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల కిందట నింగిలోకి పంపిన జీశాట్‌-6ఏఉపగ్రహంతో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఇస్రో ప్రతినిధులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మార్చి 29న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి పంపిన ఉపగ్రహం తొలిదశ విజయవంతంకాగా, తుది దశలో మాత్రం సాంకేతిక లోపాలు తలెత్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఉపగ్రహంతో లింక్‌ కోల్పోవడం ఆందోళనకరమే అయినా, సంబంధాలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో తెలిపింది.

అసలేం ఏం జరిగింది?: భారత సమాచార వ్యవస్థకు పదునుపెట్టే లక్ష్యంతో గత గురువారం ఇస్రో జీశాట్‌6–ఏ ప్రయోగాన్ని చేపట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని ప్రయోగవేదిక నుంచి జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08) ఉపగ్రహ వాహకనౌక 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్‌ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు శుక్రవారం విజయవంతంగా పొడిగించారు. కాగా, శనివారం నాటికి అనూహ్య రీతిలో ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీతో ఉపగ్రహానికి సంబంధాలు తెగిపోయాయి.

మరింతలోతుకు వెళితే..: జీశాట్‌ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. హసన్‌(కర్ణాటక)లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పెరిజీని 170 కిలో మీటర్ల నుంచి 5,054 కిలోమీటర్ల ఎత్తుకు, అపోజీని 35,975 కిలోమీటర్లు నుంచి 36,412 ఎత్తుకు పెంచారు. శనివారం.. చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయంలోనే ఉపగ్రహంలో లోపాలు తలెత్తాయి. అప్పటి నుంచి జీశాట్‌6ఏ భూమితో అనుసంధానం కోల్పోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com