'షాదీ ముబారక్‌' సాయం కోసం 39,007 దరఖాస్తులు

- April 02, 2018 , by Maagulf
'షాదీ ముబారక్‌' సాయం కోసం 39,007 దరఖాస్తులు

హైదరాబాద్‌: షాదీ ముబారక్‌ పథకంలో 39,007 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ప్రభుత్వం 24,891 మందికి సాయం అందించిందని రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారు ఎకె.ఖాన్‌ తెలిపారు. మరో వారం పది రోజుల్లో ఆరువేల మంది దరఖాస్తు దారులకు చెక్కులు పంపణీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి హజ్‌ హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర ఉర్ధూ అకాడెమీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ఎ.షుకూర్‌ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి షాదీ ముబారక్‌ కింద రూ. 1,00,116లు అందించనున్నట్టు తెలిపారు. ముస్లింల పెళ్లికి సంబంధించి వక్ఫ్‌ బోర్డు జారీ చేసే సర్టిఫికెట్‌ వచ్చే వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదని పెళ్లిని ధృవీకరించే అర్హత గలసర్టిఫికెట్‌ను జతచేసి సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఈ విషయం లో ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్‌లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో అవినీతి అక్రమాలకు తావులేదన్నారు. గతంలో ఫిర్యాదులపై-విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టు ఎ.కె.ఖాన్‌ గుర్తుచేశారు.

ఉర్ధూ అధికారుల పోస్టులు గ్రేడ్‌-1(6 ఖాళీలు), గ్రేడ్‌-2(60ఖాళీలు)కు అర్హులైన అభ్యర్ధులు ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. అర్హులైన అభ్యర్ధులు పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగా ఆన్‌లైన్‌ నుంచే హాల్‌టిక్కెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మే 20వ తేదీన గ్రేడ్‌-2 అభ్యర్ధులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, గ్రేడ్‌-1 అభ్యర్ధులకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు రాతపరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉర్ధూ అధికారుల పోస్టుల భర్తీకి సాంకేతికంగా హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ సహకారం తీసుకుంటున్నట్టు వివరించారు. ఉర్ధూ అధికారుల పోస్టుల భర్తీపై అభ్యర్ధులు ఇతర సమాచారం కోసం ఫోన్‌ నెంబర్‌ 040-23237810లో సంప్రదించవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com