యూట్యూబ్ పై కాల్పులు జరిపింది ఈమే!!

- April 04, 2018 , by Maagulf

కాలిఫోర్నియాలోని యూట్యూబ్‌ కార్యాలయంలో కాల్పులు జరిపి.. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్న మహిళను నసీమ్‌ నజఫి అఘ్దంగా పోలీసులు గుర్తించారు. సాన్‌ డియాగోకు చెందిన ఆమె తరచూ యూట్యూబ్‌ వాడుతుందని, యూట్యూబ్‌ తీసుకొచ్చిన తాజా ‘నియంతృత్వ’ విధానాలతో ఆగ్రహం చెంది.. ఇలా కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

హ్యాండ్‌గన్‌తో యూట్యూబ్‌ క్యాంపస్‌లోకి ప్రవేశించిన 39 ఏళ్ల నసీం విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు గాయపడ్డారు. ఒక్కసారిగా తూటాల మోతతో యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో భీతావహ పరిస్థితిని సృష్టించిన ఆమె ఆ తర్వాత తనను తాను కాల్చుకొని మరణించింది.

దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన నసీం పర్షియన్‌ సంతతి మహిళ అని తెలుస్తోంది. ఆమెకు యూట్యూబ్‌లో పలు వీడియో చానెళ్లు ఉన్నట్టు సమాచారం. యూట్యూబ్‌ నియంతృత్వ విధానాలు అవలంబిస్తోందని, ఏమాత్రం సమానత్వాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను పాటించడం లేదని ఆమె గతంలో ఆరోపించింది. తన వీడియో చానెళ్లను సెన్సార్‌ చేస్తూ.. నియంత్రిస్తోందని ఆమె తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో యూట్యూబ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

జంతు హక్కుల కార్యకర్తగా తనను తాను అభివర్ణించుకున్న నసీం సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేది. ఆమెకు పలు యూట్యూబ్‌ చానెళ్లతోపాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివాటిలో పేజీలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో యూట్యూబ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఓ వీడియో కూడా విడుదల చేసింది. తన  యూట్యూబ్‌ చానెల్‌లో ఐదువేలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, ఎక్కువ వ్యూస్‌ వచ్చేవని, కానీ తన వీడియోలను యూట్యూబ్‌ ఫిల్టర్‌ చేస్తుండటంతో వ్యూస్‌ తగ్గిపోయి.. తనకు ఆదాయం ఏమీ రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ తీరుపై ఆగ్రహంతోనే ఆమె కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. ఆమె తండ్రి ఇస్మాయిల్‌ అఘ్దం కూడా మీడియాతో మాట్లాడుతూ తన కూతురు యూట్యూబ్‌పై ఆగ్రహంగా ఉందని, ఆమె యూట్యూబ్‌ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చునని అంతకుముందు పోలీసులను హెచ్చరించినట్టు మీడియాకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com