సిరియాలో సైన్యాల మొహరింపు..అమెరికాకు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్
- April 10, 2018
సిరియా విషయంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకపక్క అమెరికా, రష్యాల మధ్య వాగ్యుద్ధం చెలరేగగా, మరోపక్క సిరియా సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తామని రష్యా, టర్కీ, ఇరాన్ దేశాల అధ్యక్షులు ప్రకటించారు. కాగా సిరియాలో ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ బలగాలు చేరుకున్నాయి. సిరియాపై అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించాయి. రెబెల్స్ అదుపులో వున్న పట్టణంపై సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య మాటల యుద్ధం చెలరేగింది. తక్షణమే సిరియాపై సైనిక చర్యకు దిగుతామని అమెరికా బెదిరించగా, అదే జరిగితే తీవ్ర పర్యవసానాలు వుంటాయని రష్యా హెచ్చరించింది. తమపై వచ్చిన ఆరోపణలు బూటకమని, అవసరమైతే ఆయుధ ఇనస్పెక్టర్లను దాడి జరిగిందని చెబుతున్న ప్రాంతానికి తీసుకెళతామనిసిరియా ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తక్షణమే కార్యాచరణకు దిగాలని అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, మరో ఆరు దేశాలు కోరాయి. అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఐరాస సమావేశంలో మాట్లాడుతూ, భద్రతా మండలితో నిమిత్తం లేకుండా చర్య తీసుకోవడానికి తాము సిద్ధంగా వున్నామని చెప్పారు. భద్రతా మండలి తన విధులను నిర్వరిస్తుందా లేక సిరియా ప్రజలను కాపాడడంలో పూర్తిగా విఫలమవుతుందా అనేది తేలాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంతకుముందు రష్యా రాయబారి మాట్లాడుతూ ఈ ఆరోపణలన్నీ బూటకమని కొట్టిపారేశారు. అవసరమైతే ఆయుధ ఇనస్పెక్టర్లను దాడి జరిగిందని చెబుతున్న ప్రాంతానికి తీసుకెళతామని చెప్పారు. సిరియాపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించారు. సిరియాలో ఐక్యరాజ్య సమితి దూత స్టాఫన్‌డీ మిత్సురా మాట్లాడుతూ, అంతర్జాతీయ శాంతి, భద్రతల పరిరక్షణ, అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించాల్సిన కర్తవ్యంతో భద్రతా మండలి ముందుకు సాగాలని కోరారు.
సిరియా సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాం..రష్యా, టర్కీ, ఇరాన్ అధ్యక్షుల ప్రకటన
సిరియాలో సంభవిస్తున్న పరిణామాలపై అలాగే టర్కీ, రష్యా, ఇరాన్‌ల మధ్య సంబంధాలపై చర్చించేందుకు ఆయా దేశాల అధ్యక్షులు ఈ నెల 4వ తేదీన అంకారాలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తీవ్రవాదంపై పోరు సల్పే సాకుతో కొత్త పరిస్థితులు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అధ్యక్షులు తిరస్కరించారని ఆ ప్రకటన పేర్కొంది. సిరియా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బ తీసేందుకు ఉద్దేశించిన వేర్పాటువాద ఎజెండాకు వ్యతిరేకంగా నిలబడేందుకు వారు తమ కృత నిశ్చయాన్ని వెలిబుచ్చారని తెలిపింది. అల్‌ఖైదా,డాయిష్/ ఐఎస్‌ఐఎల్‌తో సంబంధాలుండే వ్యక్తులు, అన్ని గ్రూపులు, సంస్థలను నిర్మూలించేందుకు గానూ పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని ముగ్గురు నేతలు పుతిన్, ఎర్డోగన్, రౌహనిలు పునరుద్ఘాటించారు. సిరియాలోని వివిధ పక్షాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి కజకస్తాన్ రాజధాని అస్తానాలో శాంతి చర్చలు జరిపే క్రమంలో భాగంగా అంకారా శిఖరాగ్ర సదస్సు జరిగింది. రష్యా మాజీ గూడచారిపై విష ప్రయోగం ఆరోపణల నేపథ్యంలో రష్యా దౌత్యవేత్తలను నాటో, ఇయు దేశాలు బహిష్కరించాయి. కానీ టర్కీ మాత్రం తాము అందులో భాగస్వాములం కాబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ మధ్య సంబంధాలు బాగున్నాయని ఎర్డోగన్ తెలిపారు.
సిరియాలో బ్రిటన్, ఫ్రాన్స్ బలగాలు...అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి
సిరియా విషయంలో అమెరికాతో కలిసి సమన్వయంతో పనిచేయడానికి బ్రిటన్, ఫ్రాన్స్ సిద్ధంగా వున్నాయి. సిరియాపై సైనిక దాడి జరపడానికి కూడా వారు సై అంటున్నారు. ఈనెల 7వ తేదిన సిరియాలోని తూర్పు ఘౌటాలో రసాయన దాడి జరిగిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ధృవీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్‌కు ఫోన్ చేసి మరీ చెప్పారు. రసాయన ఆయుధాలు ఉపయోగించినట్లు తేలితే ఫ్రాన్స్ చర్యకు దిగడం ఖాయమని ఇంతకుముందే మాక్రాన్ చెప్పారు. బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, సిరియా సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులతో సహా అన్ని అవకాశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి, బ్రిటన్, ఫ్రాన్స్ బలగాలు ఇప్పటికే సిరియాలో మోహరించాయి. ప్రస్తుతానికి ప్రత్యేక బలగాలను మాత్రమే అక్కడ మోహరించారు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్‌లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్‌లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









