పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ పై జీవితకాల నిషేధం

- April 13, 2018 , by Maagulf
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ పై జీవితకాల నిషేధం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్ తన జీవితకాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని పాక్‌ సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. అంతేగాక, బహిరంగ సభలు కూడా పెట్టారదని స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ దేశ అత్యున్నత న్యాయస్ధానం వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనర్హత వేటు వంటి చర్యలు అవసరమని సుప్రీం కోర్టు పేర్కొంది.

నవాజ్‌ షరీఫ్‌తో పాటు పాకిస్థానీ తెహ్రీక​ ఇన్సాఫ్‌ (పీటీఐ) సెక్రటరీ జనరల్‌ జహంగీర్‌ తరీన్‌పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది.

కాగా, పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్‌ అసిఫ్‌ సయీద్‌ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్‌ సుప్రీం బెంచ్‌ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో షరీఫ్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పాక్‌ మాజీ ప్రధాని జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు, పనామా పేపర్స్ లీక్స్ కేసులో నవాజ్ షరీఫ్ దోషిగా తేలిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు దేశంలో సంచలనగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com