'గల్ఫ్‌'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్న ఇద్దరు నకిలీ ఏజెంట్లు అరెస్ట్

- April 16, 2018 , by Maagulf
'గల్ఫ్‌'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్న ఇద్దరు నకిలీ ఏజెంట్లు అరెస్ట్

హైదరాబాద్:విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు ఏజెంట్లను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్ర కారం.. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన గమ్లురీ అమానుల్లా కార్పెంటర్. తన వృత్తిలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అరబ్ దేశాల్లో కొన్నాళ్లు పనిచేసి వచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన గుండాల మహ్మద్ గౌస్‌తో కలిసి సబ్ ఏజెంట్లను ఏర్పా టు చేసుకొని గల్ఫ్ దేశాలకు నాల్గో తరగతి ఉద్యోగాలను పంపించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని సబ్ ఏజెంట్లతో మాట్లాడి రూ. 85 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసి, గల్ఫ్ దేశాల్లో క్లీనింగ్, వాచ్‌మెన్, కార్పెంటర్, ఇండ్లలో పనిచేసే వారిని విజిటింగ్ వీసా మీద పంపించాలని పథకం వేశారు. ఇందులో భాగంగా సబ్ ఏజెంట్లతో నిరుద్యోగులు, నిరక్ష్యరాసులను ఎంచుకొని వారికి విదేశాల్లో మంచి జీతాలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ విదేశాలకు పంపిస్తున్నారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని విష్ణు హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారిని అక్కడకు రప్పిస్తారు. అడ్వాన్స్‌గా డబ్బు తీసుకొని, పాస్‌పోర్టును తీసుకుంటారు. అయితే నిబంధనల ప్రకారం వీసా ఇప్పిస్తామంటూ నమ్మించి, విజిటింగ్ వీసా, టూరిస్ట్ వీసాలు ఇప్పించి, కడప జిల్లాకు చెందిన మహ్మద్ షరీఫ్ సహకారంతో విమానం టెక్కెట్లను కొనిచ్చి విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన తరువాత తమ వీసా గడువు ఒకటి, రెండు నెలల్లో ముగియడంతోనే సమస్యల్లో చిక్కుకుంటున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు బృందానికి వచ్చిన సమాచారంతో విష్ణు హోటల్‌లోని రూం. నెం.150 గదిలో తనిఖీలు చేశారు. ఆ సమయం లో అమనుల్లా, హైదరాబాద్ ఫతేదర్వాజాకు చెందిన మహబూబ్‌ఖాన్‌లు అమాయకులను విదేశాలకు పంపించేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆరా తీయడంతో నిరుద్యోగులకు మాయ మాటలు చెబుతూ, విదేశాల్లో మంచి జీతాలిప్పిస్తామని మోసం చేస్తున్నట్లు గుర్తిం చి అమనుల్లా, మహబూబ్‌ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ గ్యాంగ్ సభ్యుల దందా బయటపడింది. మహ్మద్ గౌస్, షరీఫ్‌లు పరారీలో ఉండగా అమనుల్లా, మహబూబ్‌ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు పాస్‌పోర్టులు, మూడు సెల్‌ఫోన్లు, రూ. 3800 నగదును స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నకిలీ కన్సల్టెన్స్‌తో జాగ్రత్త : టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు తమకు తాముగా విదేశాలకు పంపించే కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, తదితర గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి, ఎక్కువ జీతాలిప్పిస్తామని ఆశ చూపి విజిటింగ్ వీసా, టూరిస్ట్ వీసాలు ఇప్పించి పంపిస్తుంటారు. అక్కడకు వెళ్లిన తరువాత అవి ఉద్యోగాలు చేసేందుకు చెల్లవు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేంట్ నుంచి అనుమతి పొందిన రిజిస్ట్రేషన్ అయిన ఏజెన్సీల నుంచి వెళ్లినవారికే ఉద్యోగాలిస్తారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధకిషన్‌రావు తెలిపారు. ఇలా విదేశాలకు వెళ్లిన తరువాత ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, సదరు కన్సల్టెన్సీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నకిలీ ఏజెంట్లు, నకిలీ కన్సల్టెన్సీల నిర్వాహకులు ఎవరైనా విదేశాలకు పంపిస్తామంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com