ట్రంప్‌ వాణిజ్య యుద్ధ నివారణకు...-భారత్‌ మద్దతుకై చైనా ఆశాభావం

ట్రంప్‌ వాణిజ్య యుద్ధ నివారణకు...-భారత్‌ మద్దతుకై చైనా ఆశాభావం

బీజింగ్‌: వాణిజ్య యుద్ధానికి దారితీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కున్న చర్యలతో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు, భారత్‌ నుంచి సానుకూలత లభించగలదని చైనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మోడీ- జీ జిన్‌పింగ్‌ జరిపే భేటీ నేపథ్యంలో ఈ మేరకు బహిరంగ సంకేతాలు పంపింది. 'ఉభయదేశాలకు ఉమ్మడి ఆసక్తులు, లక్ష్యాలు, స్థితిగతులు ఉన్నాయి. విశ్వ విపణి అభివృద్ధికి వీలుగా తాజా ప్రపంచ పరిణామాలను వారు చర్చించగలరని, అందువల్ల భారత్‌ నుంచి మద్దతు లభిస్తుంది' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు-కాంగ్‌ విలేకరులకు తెలిపారు. అమెరికా 350 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటును భర్తీ చేసుకోవడానికి చైనా ఎగుమతులపై వరుసగా భారీ సుంకాలు విధిస్తుండటం తమకు అతిపెద్ద సవాలుగా నిలిచిందని ఆయన స్పష్టీకరించారు. ఈమేరకు ట్రంప్‌ చర్యలు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపగలవన్నారు. బీజింగ్‌ తన సొంత సుంకాలతో దీన్ని తిప్పికొట్టడానికి యత్నించిందని, కానీ అత్యధిక సరకుల విక్రేతగా చైనా ఎక్కువే కోల్పోతోందని తెలిపారు.

Back to Top