రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర
- April 27, 2018విడుదల తేదీ : ఏప్రిల్ 27, 2018
మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం
దర్శకత్వం : జి.నాగేశ్వర్ రెడ్డి
నిర్మాతలు : కీర్తి చౌదరి, కిట్టు
సంగీతం : ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రఫర్ : సిద్దార్థ రామస్వామి
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
స్క్రీన్ ప్లే : జి. నాగేశ్వర్ రెడ్డి
మంచు విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. విష్ణు సరసన ప్రగ్య జైస్వాల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకులు ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అమెరికా నుండి ఇండియా వచ్చిన రేణుక (ప్రగ్య జైస్వాల్)ను ఆమె ఇంటికి హోమం చేయించడానికి వచ్చిన పూజారి కృష్ణమాచారి (మంచు విష్ణు) ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకునే సమయానికి రేణుక చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతుంది.
ఆమె కోసం కృష్ణమాచారి తన గురువు అప్పలాచారి(బ్రహ్మానందం)కి మాయ మాటలు చెప్పి అందరినీ అమెరికా తీసుకెళతాడు. అక్కడ తన ప్రేమను దక్కించుకోవడం కోసం కృష్ణమాచారి ఏం చేశాడు, అతని వలన అప్పలాచారి ఎలాంటి ఇబ్బందులుపడ్డాడు, అసలు కృష్ణమాచారి, రేణుకల ప్రేమకు అడ్డుపడింది ఎవరు అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్:
సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్స్ బ్రహ్మానందం, మంచు విష్ణుల కామెడీ ట్రాక్. బ్రాహ్మణుల గెటప్లో లుక్స్ తోనే ఇంప్రెస్ చేసిన వీరిద్దరూ సినిమాలో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. పెళ్లికాని పురోహితుడిగా బ్రహ్మాంనందం ట్రాక్ బాగా పండింది. అలాగే అమెరికా వెళ్ళాక శిష్యుడు చేసే తప్పులకు భయపడుతూ, ఎరక్కపోయి ఇరుక్కుపోయిన గురువు పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల నవ్వులు పూయించింది.
విష్ణు కూడ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. కథలో ముఖ్యమైన తాత, మనవరాళ్ల సెంటిమెంట్ ట్రాక్ ఎమోషనల్ గా కొంత వర్కవుట్ అయ్యింది. తాత పాత్రలో కోటా శ్రీనివాసరావుగారు మెప్పించారు. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ కొంత పర్వాలేదనిపించాడు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తన గత చిత్రాలు ‘సీమ టపాకాయ్’, విష్ణుతో చేసిన ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలు ఆతరహాలో ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగా తయారుచేయలేకపోయారు. సింపుల్ కథను తీసుకున్న ఆయన బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, పృథ్వి వంటి స్టార్ కామెడియన్లను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారు. కొద్దో గొప్పో బ్రహ్మానందం మినహా మిగతా వారంతా చాలా చోట్ల వృధాగానే కనిపించారు. ముఖ్యంగా ఆఖరి అరగంటలో వచ్చే పృథ్వి కామెడీ ట్రాక్ చికాకు పుట్టిస్తుంది.
చాలా నార్మల్ గా మొదలైన సినిమా ఒకటి రెండు చోట్ల మినహా మరెక్కడా కూడ వేగం అందుకోదు. భిన్నమైన కథనం లేకపోవడం, కాలం చెల్లిన కామెడీ ట్రాక్స్ వలన సినిమా ఆద్యంతం బోర్ కొట్టించేసింది. తాత, మనవరాళ్ల ఎమోషనల్ ట్రాక్ మినహా సినిమాలో మరే అంశం కూడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
కొన్ని సన్నివేశాలైతే మరీ బలవంతంగా ఇరికించినట్టు తోచాయి. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి కమెడియన్లనే కాక ఠాకూర్ అనూప్ సింగ్ వంటి ప్రతినాయకుడ్ని కూడ సక్రమంగా ఉపయోగించుకోలేక సినిమాను చప్పగా తయారుచేశారు. చాలా సన్నివేశాలు ఎలాంటి హోమ్ వర్క్ లేకుండా అప్పటికప్పుడు రాసుకుని చిత్రీకరించినట్టే ఉన్నాయి.
సాంకేతిక విభాగం:
దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిగారు ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో చేసిన నవ్వించే ప్రయత్నం ఫలించలేదు. బహీనమైన కథ, కథనం, కొత్తగా అనిపించే కామెడీ ట్రాక్స్ రాసుకోకపోవడం, కమెడియన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం వంటి తప్పిదాల వలన సినిమాను ఆకట్టుకునే విధంగా తయారుచేయలేకపోయారాయన.
రచయిత మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు సినిమాని నిలబెట్టే స్థాయి రచనను ఇవ్వలేకపోయారు. సంగీత దర్శకుడు తమన్ పెద్దగా గుర్తుండిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, పాటల సంగీతాన్ని కానీ ఇవ్వలేదు. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. వర్మ ఎడిటింగ్ ద్వారా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సింది. కీర్తి చౌదరి, కిట్టులు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు:
పాత తరహా కామెడీ ఫార్ములానే నమ్ముకుని వచ్చిన ఈ ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అందించదు. తాత, మనవరాళ్లు ఎమోషనల్ ట్రాక్, బ్రహ్మానందం కామెడీ మినహా అదే పాత, బలహీనమైన కథా కథనాలు, కొద్దిగా కూడ ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్, ఎక్కడా కూడ పెద్దగా నవ్వించలేకపోయిన కమెడియన్ల పెర్ఫార్మెన్స్ వంటి బలహీనతలు కలిసి సినిమాను బోర్ కొట్టించేలా తయారుచేశాయి. మొత్తం మీద హాస్యభరితమైన సినిమాల్ని, బ్రహ్మానందం కామెడీని కోరుకునే వారికి ఈ చిత్రం కొంత పర్వాలేదనిపిస్తుంది కానీ కొత్తదాన్ని ఆశించేవారిని అస్సలు మెప్పించదు.
మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 2.5/5
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్లకు స్వాగతం..!!