మరో ఇద్దరు కీలక నేతలతో భేటి కానున్న కేసీఆర్

- April 29, 2018 , by Maagulf
మరో ఇద్దరు కీలక నేతలతో భేటి కానున్న కేసీఆర్

హైదరాబాద్‌ నుంచే రాజకీయ భూకంపం సృష్టిస్తానని ప్లీనరీ వేదికగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. దేశ రాజకీయాలు, పరిపాలనలో గుణాత్మక మార్పు కోసమంటూ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై వెళ్లిన కేసీఆర్‌.. డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆ తర్వాత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో సమావేశం నిర్వహించారు.

స్టాలిన్‌ ఇంట్లోనే భోజనం చేసిన కేసీఆర్‌.. చాలాసేపు ఆయనతో చర్చలు జరిపారు. దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతోపాటు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాట్లపైనా సుదీర్ఘ మంతనాలు జరిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ రాజీకయ వేదిక అవసరంపై స్టాలిన్‌తో  చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని స్టాలిన్‌ అభినందించారు. అలాగే మే 10న చేపట్టనున్న రైతుబంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టాలిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కేసీఆర్‌. ఈ భేటీలను రాజకీయ కోణంలో కాకుండా దేశాభివృద్ధికి సరికొత్త దిక్సూచిగా చూడాలని కేసీఆర్‌ సూచించారు.

తమది మూడో ఫ్రంట్‌ కాదని, దేశ ప్రజలకు మేలు చేసేందుకే చర్చలు జరుపుతున్నామని కేసీఆర్‌ చెప్పారు. ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్న కేసీఆర్‌.. చంద్రబాబుతోనూ తాను చర్చిస్తానని అన్నారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఈ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు దేశ ప్రజలకు మేలు జరగాలంటే విధానాలు, రాజకీయాల్లో ఎలాంటి మార్పు కావాలనే దానిపై విస్తృత చర్చ జరగాలన్నారు. రెండు మూడు నెలల్లో విధివిధానాలు ప్రకటిస్తామని కేసీఆర్‌ చెప్పారు. 

ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, జేడీఎస్‌ నేత దేవేగౌడతో చర్చలు జరిపిన కేసీఆర్‌... జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ మద్దతు కూడా తీసుకున్నారు. ఇక నవీన్‌ పట్నాయక్‌ తోనూ సమావేశం కాబోతున్నట్లు గతంలోనే ప్రకటించిన సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయితే కూటమి కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తిగా మారింది. ఈరోజు చెన్నైలో మరికొందరు నేతలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు.

ఇక స్టాలిన్‌తో భేటీ తర్వాత కేసీఆర్‌ చెన్నైలోని కపాలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com