సింగపూర్ లో తెలుగు సమాజం మేడే వేడుకలు...

- May 02, 2018 , by Maagulf

సింగపూర్:"శ్రమిద్దాం...శ్రమను గుర్తిద్దాం...శ్రమను గౌరవిద్దాం" అనే నినాదం తో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ వేడుకలను  మే 1, మంగళవారం నాడు స్థానిక క్రాంజి రెక్రియేషన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 800 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని , తన సాహితీ ప్రస్థానంలో స్వరపరిచిన, గానం చేసిన అనేక వైవిధ్య మరియు ఉత్తేజభరితమైన పాటలతో ఆహుతులను ఉర్రూతలూగించారు. సింగపూర్ తెలుగువారి కోసం వారు ఒకపాటను రచించి, స్వరపరచి ఆలపించారు. శ్రీనివాస్  మాట్లాడుతూ తెలుగు సమాజం మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం కి తను ముఖ్య అతిధిగా హాజరు  కావటంపట్ల హర్షంవ్యక్తపరిచారు. ఈ వేడుకల సంధర్భంగా సమాజం వారు కార్మికసోదరులకు నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులను , ప్రశంసాపత్రాలను అందించారు.

సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి  మాట్లాడుతూ,సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండ గా ఉంటామని,తెలుగు వారందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి  హాజరైన తెలుగు వారికి మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ మరియు దాతలకు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com