ప్రకృతి విలయ తాండవం.. 79మంది మృతి

- May 03, 2018 , by Maagulf
ప్రకృతి విలయ తాండవం.. 79మంది మృతి

జైపూర్: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాను, భారీ వర్షం బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి తోడు ఇసుక తుఫాను తోడవడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దాదాపు 79మంది మృత్యువాత పడ్డారు. ఈ 79మందిలో 32మంది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, 47మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం. ప్రకృతి విలయ తాండవం వల్ల మరో 100 మందికి పైగా గాయపడ్డారు. 48గంటల్లో తుఫాను కారణంగా రేగిన భయోత్పాతం అంతాఇంతా కాదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 48గంటలు హై అలర్ట్ ప్రకటించింది.

తమకందిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ 47మంది చనిపోయారని, 38మంది గాయపడ్డారని విపత్తుల శాఖ కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు. బిజ్నూర్, బరేలీ, షహరన్‌పూర్, పిలిబిత్, ఫిరోజాబాద్, చిత్రకూట్, ముజఫర్‌నగర్, రాయ్‌బరేలీ, ఉన్నవ్ ప్రాంతాల్లో ఈ తుఫాను వల్ల నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. కరెంట్ స్థంభాలు నేలకొరిగాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆగ్రా ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రకృతి విపత్తుపై రాజస్థాన్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె తుఫాను వల్ల మృత్యువాతపడ్డ బాధిత కుటుంబాలకు 4లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులకు సహాయక చర్యల్లో సహకరిస్తారని ఆయన తెలిపారు. సహాయక చర్యలపై వ్యక్తిగత పర్యవేక్షణ జరుపుతున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. యోగి ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. యూపీ సీఎం తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇంత విషాదం చోటుచేసుకుంటే సీఎం దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సింది పోయి ఎన్నికల ప్రచారానికి వెళ్లడమేంటని నిలదీస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com