అమెరికా:హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో ఫెడరల్ కోర్టు కీలక తీర్పు...

- May 04, 2018 , by Maagulf
అమెరికా:హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో ఫెడరల్ కోర్టు కీలక తీర్పు...

అమెరికాలోని కాన్సాస్‌లో గతేడాది హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కేసులో ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడు ఆడం ప్యూరింటన్‌కు జీవిత ఖైదు విధించింది. చంపాలన్న ఉద్దేశంతోనే ఆరోజు అతను తుపాకీతో బార్‌లోకి ప్రవేశించినట్టు విచారణలో తేలడంతో దోషికి కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. చాలా మందిని చంపాలన్న ప్లాన్‌తోనే ఆరోజు ఆడం ప్యూరింటన్ ఉన్నాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పట్ల శ్రీనివాస్ భార్య సునయన హర్షం వ్యక్తం చేశారు. తన భర్తను తిరిగి తీసుకురాలేకపోయినా, నిందితుడికి కఠినమైన శిక్ష విధించడం ద్వారా ఇకపై ఇలాంటి చర్యలకు దిగాలనుకునే వాళ్లకు గట్టి మెసెజ్ పంపినట్టయ్యిందనన్నారు. కేసు విచారణ వేగంగా పూర్తి చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. 

32 ఏళ్ల ఇండియన్ టెక్కీ శ్రీనివాస్ ఫిబ్రవరి 22న తన స్నేహితుడితో కలిసి బార్‌కు వెళ్లిన సమయంలో అక్కడ జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తూ ఆడం ప్యూరింటన్ కాల్పులు జరిపాడు. ఈ దేశం విడిచి వెళ్లిపోండి అని పెద్దగా అరుస్తూ ఫైరింగ్ మొదలుపెట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న శ్వేతజాతీయుడు ఆడంను అడ్డుకోవడంతో మరికొందరికి ప్రాణాపాయం తప్పింది. ఈ రేసిజం ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఐతే, ఇలాంటివి ఉపేక్షించేది లేదని పౌరుల భద్రతకు భరోసా కల్పిస్తామని US ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. కేసు విచారణను కూడా వేగంగా పూర్తి చేసింది. చివరికిప్పుడు దోషికి జీవిత ఖైదు పడడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com