లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పిన ఈశా అంబానీ...మరి ఎవరికో తెలుసా?

- May 07, 2018 , by Maagulf

ముంబై: ఇటీవలే కుమారుడి నిశ్చితార్థం జరిపించిన భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట మరో శుభకార్యం త్వరలోనే జరగనుంది. ఆయన కుమార్తె ఈశా అంబానీ దేశ దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన పిరమాల్‌ సంస్థల వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా చక్కటి స్నేహబంధం కొనసాగుతోంది. ఈశా, ఆనంద్‌ల మధ్య కూడా గాఢమైన స్నేహం ఉంది. ఇటీవలే ఈశా కవల సోదరుడు ఆకాశ్‌కు వజ్రాల వ్యాపార దిగ్గజం రస్సెల్‌ మెహతా కుమార్తె శ్లోకతో వివాహం నిశ్చయమైన విషయం గమనార్హం. ఆకాశ్‌, శ్లోకల వివాహం లాగే....ఆనంద్‌, ఈశాల వివాహం కూడా డిసెంబరులోనే జరగవచ్చని తెలుస్తోంది.

చాలా కాలంగా స్నేహం..లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పిన ఈశా
ఈషా, ఆనంద్‌ చాలాకాలంగా మంచి స్నేహితులు. ఆనంద్‌ పిరమల్‌ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్‌ చేశారు. ఆమె ఒప్పుకోవడం.. ఇరువైపులా పెద్దలకు తెలియజేయడం.. వాళ్లూ అంగీకరించడం వేగంగా జరిగిపోయాయి. 

ఉన్నత విద్య..సోషల్ మీడియాలో వైరల్
పెన్సిల్వేనియా వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌, హార్వర్డ్‌ వర్సిటీలో ఎంబీయే చేసిన ఆనంద్‌ పిరమల్‌ ప్రస్తుతం పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 'పిరమల్‌ రియల్టీ' పేరుతో ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని స్థాపించారు. 'పిరమల్‌ స్వాస్థ్య' పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థను స్థాపించి, రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్సనందిస్తున్నారు. ఇక, యేల్‌ యూనివర్సిటీ నుంచి 'సైకాలజీ అండ్‌ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌'లో పట్టభద్రురాలైన ఈషా.. రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉంది. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీయే చేస్తోంది. జూన్‌ నాటికి ఆమె చదువు పూర్తవుతుంది. కాగా.. ఆనంద్‌ ఈషాకు ప్రపోజ్‌ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

వ్యాపారంలో కీలకంగా.. జియో.. ఈషా ఆలోచనే
యేల్‌ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ....సౌత్‌ఏషియన్‌ స్టడీస్‌లో డిగ్రీ చేసిన ఈశా అంబానీ ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేస్తున్నారు. రిలయెన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో ఈశాది కీలక పాత్ర. దేశీయులకు అందుబాటు ధరల్లో, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందించాలన్న ఈశా అభిప్రాయంతోనే రిలయన్స్‌ జియోను ప్రారంభించినట్లు స్వయంగా ముకేశ్‌ ప్రకటించిన సంగతి విదితమే. 2008లో.. రూ.4,710 కోట్ల నికర విలువతో ఈశా అంబానీ ఫోర్బ్స్‌ యంగెస్ట్‌ బిలియనీర్‌ వారసుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. 2015లో.. ఆసియాలో శక్తిమంతమైన భవిష్యత్తు వ్యాపారవేత్తల్లో ఈశా మెరిశారు. 

ఇరు కుటుంబాల విందు..తేదీలు ఖరారు చేయాల్సి ఉంది..
కవలల్లో ఆకాశ్‌ కంటే ఈశానే పెద్దది. కొన్ని సెకన్ల ముందు ఆమె జన్మించిందట. అందువల్ల ఈశా వివాహం ముందు జరిపిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే కుటుంబవర్గాలు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు. ఆకాశ్‌-శ్లోక, ఈశా-ఆనంద్‌ వివాహ తేదీలను అధికారికంగా ప్రకటిస్తేనే విషయం తెలుస్తుంది. మహాబలేశ్వర్‌లోని ఓ ఆలయంలో ఆనంద్‌ తొలుత ఈశాతో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఈశా అంగీకరించారట. అనంతరం రెండు కుటుంబాల వారూ కలిసి విందు చేసుకున్నారు. ఆనంద్‌ తల్లిదండ్రులు స్వాతి, అజయ్‌ పిరమాల్‌, సోదరి నందిని, ఈశా తల్లిదండ్రులు నీతా, ముకేశ్‌ అంబానీ, నానమ్మ కోకిలాబెన్‌, అమ్మమ్మ పూర్ణిమా దలాల్‌, ఈశా కవల సోదరుడు ఆకాశ్‌ అంబానీ, తమ్ముడు అనంత్‌ అంబానీ తదితరులంతా ఎంతో ఆనందంగా ఈ విందుకార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని తెలిసింది. 

కీలక పాత్ర ఆనంద్..సమర్థుడైన వ్యాపారవేత్త
ముకేశ్‌ అంబానీ ముద్దుల కుమార్తె ఈశా(26)ను వివాహం చేసుకోబోతున్న ఆనంద్‌ పిరమాల్‌ (33) అత్యంత సమర్ధుడైన యువ వ్యాపార వేత్తగా కొనసాగుతున్నారు. 'పిరమాల్‌ గ్రూప్‌' ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఆనంద్‌ వ్యవహరిస్తున్నారు. సంస్థ అభివృద్ధి, వ్యూహాత్మక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పిరమాల్‌ గ్రూప్‌లో చేరకముందు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసదుపాయం అందించే 'పిరమాల్‌ ఇ స్వస్థ్య' కార్యక్రమాన్ని ఆనంద్‌ ప్రారంభించారు. సామాన్యులకు, అందుబాటు ఛార్జీల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం ఈ సంస్థ లక్ష్యం. రోజుకు కనీసం 40వేల గ్రామీణులకు ఈ కార్యక్రమం కింద వైద్య చికిత్స లభిస్తోంది. ఆయన ప్రారంభించిన రెండో సంస్థ స్థిరాస్తి వ్యవహారాలు నిర్వహించే 'పిరమాల్‌ రియాల్టీ'. దేశంలో అపార విశ్వాసాన్ని, ఆదరణను చూరగొంటోంది. ఇప్పుడీ రెండు సంస్థలు, ఆనంద్‌ కుటుంబ వ్యాపారమైన పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమయ్యాయి. కాగా, ఇండియన్‌ మర్చంట్‌ ఛాంబర్‌, యువత విభాగానికి అత్యంత పిన్న వయస్సులో అధ్యక్షుడైన ఘనత కూడా ఆనంద్‌కే దక్కింది. 

కోట్ల ఆస్తులు..ముకేశ్‌ స్ఫూర్తితోనే..
సొంతంగా కంపెనీ ఏర్పాటుకు తనకు స్ఫూర్తి ఇచ్చింది ముకేశ్‌ అంబానీయే అని ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌ తెలిపారు. 'కన్సల్టింగ్‌ లేదా బ్యాంకింగ్‌ రంగంలోకి వెళ్లనా, అని నేను ముకేశ్‌ను అడిగాను. 'కన్సల్టెంట్‌ అంటే క్రికెట్‌ను చూడటం లేదా కామెంటరీ చేయడం లాంటిది. అదే సంస్థను ఏర్పాటు చేయడం అంటే క్రికెట్‌ ఆడటం. కామెంటరీ చేయడం వల్ల క్రికెట్‌ ఆడటం రాదు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే, ఉత్సాహంగా రంగంలోకి దిగాల్సిందే. వెంటనే ప్రారంభించు' అని ముకేశ్‌ సూచించారని ఆనంద్‌ చెప్పారు. కాగా, రిలియన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ ఆస్తుల మార్కెట్‌ విలువ: రూ.6 లక్షల కోట్లకుపైగా ఉంది. ఆయన పెట్రోలియం, కెమికల్స్‌, పాలిమర్స్‌, పాలిస్టర్స్‌, టెక్స్‌టైల్స్‌, రిటైల్‌, డిజిటల్‌ సర్వీసెస్‌ తదితరాల వ్యాపారాలు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. పరిమాల్ గ్రూప్ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌ ఆస్తుల మార్కెట్‌ విలువ సుమారు రూ.65,000 కోట్లకుపైగానే ఉంటుంది. ఫార్మా సొల్యూషన్స్‌, క్రిటికల్‌ కేర్‌, కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, ఫైనాన్స్‌, స్థిరాస్తి తదితర వ్యాపారాలు వారు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com