జాబ్‌ కావాలా నాయనా..?

- May 14, 2018 , by Maagulf
జాబ్‌ కావాలా నాయనా..?

మీకు సెక్రటేరియట్ లో ఉద్యోగం కావాలా లేదా  రైల్వేలో జాబ్ కావాలా..? ఎందులో కావాలంటే.. అందులో.. మీకు జాబ్‌ గ్యారెంటీ.. అయితే.. స్టేట్ లెవల్‌ జాబుకో రేటు.. సెంట్రల్‌ జాబ్‌కు మరో రేటు చెల్లించాలి. తెలంగాణ సీఎం సలహాదారుడి పీఏ నంటూ.. ఓ ఇద్దరు నిరుద్యోగులను ముంచుతున్నారు..

వరంగల్ కు చెందిన మొహమ్మద్‌ ఖీఫాయత్‌ అలీ, షేక్ మొయినుద్దీన్ లకు అమాయకులైన నిరుద్యోగులను ముంచడమే పని. ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ లక్షలు వసూలు చేస్తూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడడమే వృత్తి. ఈ ఇద్దరు కేటుగాళ్లు హైదరాబాద్‌ తో పాటు వరంగల్  లో ఆఫీసులు తెరిచి దందా కొనసాగిస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుడికి సహాయకులమని ఆఫీస్ ల  ముందు బోర్డు పెట్టుకుని వంచిస్తున్నారు. ఈ ఇద్దరు కేటుగాళ్లు తమ కార్లకు ఎర్ర బుగ్గ పెట్టుకుని బయటకు వెళ్లినప్పుడు గన్ మెన్ లతో హల్ చల్ చేస్తుంటారు. ఈ హడావిడి చూసి చాలామంది ఉద్యోగం కోసం వీరి దగ్గరికి వెళ్లారు. ఈ కేటుగాళ్లు ఏకంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులతో పాటు సెక్రటేరియట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అడ్వాన్స్ గా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. నమ్మకం కలిగించేందుకు రంజాన్ సందర్భంగా ఇచ్చే ఇఫ్తార్ విందులకు ప్రముఖులతో పాటు తమకు డబ్బులు కట్టిన వారిని కూడా పిలిచేవారు. 

రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఈ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొంత సమయం కావాలని వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో కొందరు నిరుద్యోగులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసగాళ్ల బండారం బయటపడింది. వీరి ఉచ్చులో సుమారు 20 మంది దాకా పడ్డారని, 70 లక్షలు వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.  కేటుగాళ్ల హంగామా చూసి బోల్తా పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించ వద్దని పోలీసులు చెబుతున్నారు. ఏ జాబుకైనా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తోందని, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగాలకు బ్యాక్ డోర్ ఎంట్రీలు ఉండవు. అర్హతలు, పరీక్షల ద్వారానే జాబ్‌ ల భర్తీ జరుగుతుంది. ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు నిరుద్యోగులకు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com