ఆఫ్ఘనిస్తాన్:క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు.. 8 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్:క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు.. 8 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 8 మంది మృతి చెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ఆఫ్ఘాన్ నగరమైన జలాలాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

రంజాన్‌ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థ నైట్‌టైమ్‌ టోర్నమెంట్‌ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్‌ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు క్రికెట్‌ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ చూస్తూ కేరింతలు కొడుతుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో క్రికెటర్లు, ప్రేక్షకులు చెల్లాచెదురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా క్రికెటర్లేనని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే చనిపోయినవారెవరో అధికారులు ఇంకా గుర్తించలేదు.

మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు 'అష్రఫ్‌ ఘని' ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

Back to Top