తమిళనాడులో పోలీసు కాల్పులు

- May 22, 2018 , by Maagulf
తమిళనాడులో పోలీసు కాల్పులు

చెన్నై: తమిళనాడు తూత్తకూడిలోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని చేపట్టిన ఆందోళనలో తొమ్మిది మంది నిరసనకారులు మృతిచెందారు. కొన్ని నెలలుగా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ర్యాలీ సందర్భంగా ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పట్టణంలో 144 సెక్షన్‌ విధించినప్పటికీ స్థానిక చర్చి వద్ద గుమిగూడిన నిరసనకారులు తొలుత కర్మాగారం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పటించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అయినా వారు శాంతించకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మృతిచెందారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు: మంత్రి ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి ప్రవేశించి హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని తమిళనాడు మంత్రి జయకుమార్‌ వెల్లడించారు. సీఎం పళనిస్వామి అధికారులతో మాట్లాడారని తెలిపారు. తూత్తుకూడిలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు పక్కనే ఉన్న జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు.

కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెన్నై నుంచి తూత్తుకూడికి చేరుకున్నారు. పోలీసు కాల్పులను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com