ఇరాన్‌కు అమెరికా బెదిరింపులు

- May 22, 2018 , by Maagulf
ఇరాన్‌కు అమెరికా బెదిరింపులు

వాషింగ్టన్‌ : ఇరాన్‌ తన విదేశీ, దేశీయ విధానాలను మార్చుకోవడానికి తిరస్కరించినట్లైతే చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత కఠినమైన ఆంక్షలను విధించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో హెచ్చరించారు. ''ఇరాన్‌ ప్రభుత్వంపై అనూహ్యమైన రీతిలో ఆర్థిక ఒత్తిడి తీసుకువస్తాం. మా సీరియస్‌నెస్‌ (తీవ్రత) పట్ల ఇరాన్‌ నేతలకు ఎలాంటి సందేహం అక్కర్లేదు.'' అని పాంపియో సోమవారం స్పష్టం చేశారు. సిఐఎ నుండి విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ఇరాన్‌ విదేశాంగ విధానాన్ని ఆయన ప్రస్తావించారు. 2015లో అగ్ర దేశాలన్నీ కలిసి కుదుర్చుకున్న ఇరాన్‌ అణు ఒప్పందం నుండి అమెరికా వైదొలగిన కొన్ని వారాల తర్వాత ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్‌తో కొత్త ఒప్పందం ఏదైనా కుదుర్చుకోవాలంటే 12 కఠినమైన షరతులను విధించారు. వాటిల్లో సిరియా నుండి ఇరాన్‌ సైనిక సలహాదారులను ఉపసంహరించడం ఒకటి. యెమెన్‌లో హుతి రెబెల్స్‌కు మద్దతివ్వడం విరమించాలి, ఇరాన్‌లో గల్లంతైన అమెరికా పౌరులందరినీ విడిచిపెట్టాలి, ఇరాన్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలన్నది అమెరికా ఆలోచన అని అందుకు అమెరికా మిత్రపక్షాలు కూడా సహకరించాలని కోరారు. వరుసగా విధించే ఆంక్షలు బాధాకరంగా వుంటాయి. ఇరాన్‌ తాను ఎంపిక చేసుకున్న ఆమోదయోగ్యం కాని, అనుత్పాదకతతో కూడిన పంథాను మార్చుకోకపోతే తన ఆర్థిక వ్యవస్థను సజీవంగా వుంచుకోవాలంటే చాలా పోరాటమే చేయాల్సి వుంటుందని హెచ్చరించారు. ఇరాన్‌ విధానాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తేనే ఈ ఆంక్షల నుండి ఉపశమనం వుంటుందని తెలిపారు. ఆంక్షలు ఎత్తివేస్తామని, పూర్తి స్థాయి దౌత్య, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తామని, ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణకు కూడా సహకరిస్తామని పాంపియో హామీ ఇచ్చారు.మధ్య ప్రాచ్యంలో పెత్తనం చెలాయించడానికి ఇరాన్‌కు ఎలాంటి స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో నిషేధించిన వ్యాపార సంబంధాలను కొనసాగించే వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇరాన్‌ విషయంలో తమ డిమాండ్లు సహేతుకమైనవేనని చెప్పుకున్నారు. ముందుగా మీ అణు కార్యక్రమాన్ని ఆపండి, మీరు వెనక్కి మళ్ళండి, అప్పుడు అందుకనుగుణంగా తాము కూడా స్పందిస్తామని చెప్పారు. ఇరాన్‌ తగు నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 
మీ జోక్యం అనవసరం : ఇరాన్‌ 
అమెరికా హెచ్చరికపై ఇరాన్‌ మండిపడింది. ఇలా హెచ్చరికలు చేయడం, వ్యాఖ్యానించడం అన్నీ కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాగలదని, అసంబద్ధమైన వ్యాఖ్యలని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరాన్‌ను హెచ్చరించడం, అవమానించడం ద్వారా ఇరాన్‌ అణు ఒప్పందానికి సంబంధించిన తమ అక్రమ చర్యలను (ఒప్పందం నుండి వైదొలగడం) కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమిదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బహ్రమ్‌ ఖాసెమి పేర్కొన్నారు. ఇరాన్‌ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే వుంటుందని స్పష్టం చేశారు. ఇరాక్‌, సిరియా, యెమెన్‌, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్‌ల్లో ప్రస్తుతమున్న సమస్యలకు అమెరికా విధానాలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com