దుబాయ్‌లో పట్టుబడిన హైదరాబాదీ అసద్ ఖాన్.

- December 09, 2015 , by Maagulf
దుబాయ్‌లో పట్టుబడిన హైదరాబాదీ అసద్ ఖాన్.

* దుబాయ్‌లో చిక్కిన హైదరాబాదీ * డిపోర్టేషన్‌పై తెచ్చిన ఎన్‌ఐఏ అధికారులు * హుజీ కుట్ర కేసులో అక్కడి కోర్టులో హాజరు * ఈ కేసులో మొత్తం ఏడుగురు సిటీ టైస్టులు  'బెంగళూరు కుట్ర' కేసులో వాంటెడ్‌గా ఉండి, దుబాయ్‌లో పట్టుబడిన హైదరాబాదీ అసద్ ఖాన్ అలియాస్ అసదుల్లా అలియాస్ అబు సూఫియాన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బెంగళూరు తరలించింది. ఏడాదిగా అక్కడి జైల్లో ఉన్న ఇతడిని డిపోర్టేషన్ పద్ధతిలో మంగళవారం భారత్‌కు తీసుకువచ్చింది. బుధవారం బెంగళూరులోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన సూఫియాన్ 1995లో సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లాడు. అక్కడ కొన్ని హోటల్స్ నిర్వహిస్తూ ఆర్థికంగా బలం పుంజుకున్నాడు. ఈ ముసుగులోనే ఉగ్రవాద సంస్థలకు పని చేస్తూ కీలక వ్యక్తిగా మారాడు. దేశంలో జరిగిన అనేక ఉద్రవాద కుట్రల వెనుక సూఫియాన్ పాత్ర ఉన్నట్లు ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి నేపథ్యంలోనే సౌదీ ఏజెన్సీలు గత ఏడాది సూఫియాన్‌ను పట్టుకున్నాయి. 2012లో బెంగళూరులో నమోదైన హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ(హుజీ) ఉగ్రవాద సంస్థ పన్నిన హత్యల కుట్ర కేసులో ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడు. రియాద్ కేంద్రంగా కుట్ర చేసిన ముష్కరులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, హుబ్లీ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ప్రముఖుల్ని ఏకకాలంలో హత్య చేయడానికి కుట్రపన్నారు. ఈ కుట్రను ఛేదించిన బెంగళూరు సీసీబీ అధికారులు 2012 ఆగస్టు 29-సెప్టెంబర్ 3 మధ్య హుజీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 18 మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. వీరిలో పాతబస్తీకి చెందిన ఒబేద్-ఉర్-రెహ్మాన్ ఒకడు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు అబు సూఫియాన్, ఒబేద్‌లతో పాటు హైదరాబాద్‌కే చెందిన అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ ఫర్హాతుల్లా ఘోరీ, అబు హంజాలా, మహ్మద్ అబ్దుల్ మాజిద్, మహ్మద్ భాయ్ అలియాస్ అబ్దుల్ బారీ, ఫర్ఖాన్ భాయ్ వాంటెడ్‌గా ఉన్నారు. మాదన్నపేట సమీపంలో ఉన్న కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ ధామ్ ఆలయంపై జరిగిన దాడి, 2004లో నగరంలో వెలుగులోకి వచ్చిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, 2005లో నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసుల్లో ఇతడు నిందితుడు. అబ్దుల్ బారి 2002లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద పేలుడు కేసులో నిందితుడు. దీంతో పాటు నగరంలో మరో రెండు కేసులూ ఇతడిపై నమోదై ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com