ఆయన అమెరికా.. ఈయన ఉత్తర కొరియా.. ఇద్దరినీ కలిపింది సింగపూర్..

- June 11, 2018 , by Maagulf
ఆయన అమెరికా.. ఈయన ఉత్తర కొరియా.. ఇద్దరినీ కలిపింది సింగపూర్..

ప్రపంచ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. అసాధ్యమనుకున్నది సుసాధ్యమయ్యింది. ఆజన్మ శత్రువులుగా.. ఇంతకాలం... ఉప్పూ నిప్పూగా .. ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ కనిపించిన అమెరికా.. ఉత్తర కొరియాలు.. స్నేహగీతం పాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌... నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌లు సింగపూర్‌లో సమావేశమయ్యారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. 

అనంతరం.. డొనాల్డ్‌ ట్రంప్‌- కిమ్‌ జాంగ్‌ ఉన్‌  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు.. అణ్వాయుధాలు.. ఆంక్షలపై వీరిద్ధరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అనంతరం.. రెండు దేశాల అధికారులు సమావేశమవుతారు.  ఈ చర్చలు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నానన్నారు ఇరు దేశాల అధ్యక్షులు.

ఉప్పూ నిప్పులా ఉన్న ఆ ఇద్దరిని సింగపూర్ కలిపింది. ట్రంప్, కిమ్‌లు  సింగపూర్‌లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో సమావేశమయ్యారు.. కిమ్ తన టీమ్ తో సింగపూర్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత.. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వచ్చారు. ఇది శాంతి కోసం ఒకేసారి వచ్చే అవకాశమని ట్రంప్ చెప్పారు. ఉత్తర కొరియాను అణ్వాయుధాలు వదిలిపెట్టేలా.. ఈ సమావేశం తొలి అడుగు కావాలని అమెరికా భావిస్తోంది. గత 18 నెలలుగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ట్రంప్, కిమ్‌లు ఒకరినొకరు హెచ్చరికోవడంతో పలుమార్లు యుద్ధ వాతావరణం కూడా ఏర్పడింది. 

నిన్న మొన్నటిదాకా కత్తులు దూసుకున్నారు.. ఒకరి దేశాన్ని ఒకరు నాశనం చేస్తామని ప్రకటనలు చేశారు. అమెరికాలోని ప్రధాన నగరాలకు చేరగల క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షిస్తే.. ఒక్క మీటతో ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ మాటల తూటలతో ప్రపంచ దేశాలను దాదాపు వణికించారు. ఈ నేపథ్యంలోనే అణ్వస్త్ర పరీక్షలు జరిపినందుకు ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక ఆంక్షల కొరడా ఝుళిపించింది. అయితే, ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తుూ.. ట్రంప్, కిమ్‌లు శాంతి నినాదం అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com