భారత్‌కు చెక్‌ పెట్టే దిశగా అగ్రరాజ్యాలు..

- June 17, 2018 , by Maagulf
భారత్‌కు చెక్‌ పెట్టే దిశగా అగ్రరాజ్యాలు..

అగ్రరాజ్యాలు.. భారత్‌కు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాలో భారతీయులకు గ్రీన్‌కార్డు కావాలంటే కనీసం 150 ఏళ్లపైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.. ఇక భారత విద్యార్థులకు బ్రిటన్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. చైనాసహా 25 దేశాల స్టూడెంట్స్‌ను లో రిస్క్‌ కేటగిరిలో చేర్చిన బ్రిటన్‌.. .. భారత విద్యార్థులకు ఆ జాబితాలో చోటివ్వలేదు.. ఓ వైపు అమెరికా.. బ్రిటన్‌లు భారతీయులకు తలుపులు మూస్తూ ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం రారామ్మని ఆహ్వానిస్తోంది.

అమెరికా, బ్రిటన్‌లు ఒకప్పుడు భారతీయులను రండి రండి అంటూ ఆహ్వానించేవి.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  పోటీ కారణంగా అక్కడి ప్రభుత్వాలు వీసా జారీలో వివక్ష చూపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌ ప్రభుత్వం భారతీయ విద్యార్థులను గట్టి దెబ్బ కొట్టింది. బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత సడలించింది. విదేశీ విద్యార్థులకు టైర్-4 వీసా నిబంధనలను సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సడలింపులను 25 దేశాలకు పరిమితం చేస్తూ వాటిని తక్కువ ప్రమాద దేశాలుగా అభివర్ణించింది. ఈ జాబితాలో భారత్‌కు మాత్రం చోటు కల్పించేందుకు ఇష్ట పడలేదు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ జాబితాలో భారత్ లేకపోవడంతో బ్రిటన్ యూనివర్సిటీల్లో కోర్సులకు దరఖాస్తు చేసుకొనే మన దేశ విద్యార్థులు కఠినమైన తనిఖీలను ఎదుర్కోనున్నారు.

బ్రిటన్ యూనివర్సిటీలకు ఉన్నత చదువుల కోసం అధిక సంఖ్యలో వచ్చే విదేశీ విద్యార్థుల్లో అత్యధిక శాతం అమెరికా, చైనా, భారత్‌కు చెందిన వారే ఉంటున్నారు. గతేడాది 15 వేల 171 మంది భారతీయ విద్యార్థులు టైర్-4 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆరేళ్ల కిందట ఈ సంఖ్య 30 వేలుగా ఉంది. అంటే గత ఆరేళ్లుగా బ్రిటన్‌లో చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. బ్రిటన్‌ తాజా నిర్ణయంతో భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకాస్త తగ్గనుంది.. 

అగ్రరాజ్యం అమెరికాలో కూడా భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక వీసా నిబంధనలను పూర్తి కఠినం చేశారు. అడ్వాన్స్‌డ్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోవాలని.. శాశ్వత నివాస అనుమతి పొంది అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని భావించే భారతీయులకు ఇక అవకాశం లేనట్టే.. తాజా నిబంధనల ప్రకారం అమెరికాలో పనిచేస్తూ గ్రీన్‌కార్డు  పొందాలంటే 150 ఏళ్లకు పైగా పడుతుందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే మేథో సంస్థ కాటో ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.

 2017లో జారీచేసిన గ్రీన్‌కార్డుల సంఖ్య ఆధారంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయ ఈబీ-2 వీసాదారులకు 150 ఏళ్లపైనే పడుతుందని ఆ సంస్థ విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్ 20 నాటికి 6 లక్షల 32 వేల219 మంది ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ వారి భార్యాలు, పిల్లల గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నారని తెలుస్తోంది. ఈబీ-1 కేటగిరి మాత్రం త్వరగానే వస్తోంది. ఈ కేటగిరి కింద కేవలం ఆరు సంవత్సరాలకే గ్రీన్ కార్డ్ వస్తుంది. అత్యధిక నైపుణ్యమున్న వర్గం ఈ కేటగిరి కిందకి వస్తారు. 34వేల 824 ఈబీ-1 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈబీ-3 కేటగిరీలో 17 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏప్రిల్ 20 నాటికి 54 వేల 892 మంది ఈ కేటగిరి కింద వేచిఉన్నారని లెక్కలు చెబుతున్నాయి..

అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. వేర్వేరు దేశాల వ్యక్తులకు జారీ చేసే వీసాల సంఖ్య 2016లో 5.02 లక్షలు ఉండగా 2017, సెప్టెంబరు 30 నాటికి ఈ సంఖ్య  16 శాతం తగ్గి 4.21ల క్షలకు పడిపోయింది. 2016లో 65,257మంది భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేయగా 2017 నాటికి ఆ సంఖ్య 47,302కు తగ్గింది. 

ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు విద్యార్థులకు జారీ చేసే వీసాల సంఖ్య ఎక్కువగా ఉండేది. 2015లో ఈ సంఖ్య 6.50లక్షలు. గత సంవత్సరం నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో  హెచ్‌1-బీ దరఖాస్తుదారులు వర్క్‌ వీసా, అమెరికా పౌరసత్వం, వలస సేవల ప్రయోజనాలు పొందడం కఠినంగా మారింది. వీటన్నిటి ఫలితంగా ఇంతకాలం అమెరికా...అమెరికా అంటూ కలలుకన్న యువత ఆస్త్రేలియా వైపు చూస్తున్నారు. ఆస్ట్రేలియా సైతం విసా నిబంధనలను పూర్తిగా సడలించింది. భారత యువతను ఆహ్వానించేందుకు నిబంధనలకు కొన్ని మార్పులు చేసింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com