జమ్ము కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన...

- June 19, 2018 , by Maagulf
జమ్ము కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన...

జమ్ము కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. గవర్నర్‌ పాలనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీబేపి బయటకు వచ్చేయడంతో.. కశ్మీర్‌లో మూడేళ్ల.. పీడీపీ, బీజేపి ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడం.. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో.. ఇక గవర్నర్ ఎన్‌.ఎన్‌.వోరా పాలనా  వ్యవహరాలను చూడనున్నారు..

87 అసెంబ్లీ సీట్లు ఉన్న జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 44 సీట్లు అవసరం. ప్రస్తుతం ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో గవర్నర్‌ పాలన ఏర్పాటు చేశారు. అయితే గవర్నర్‌ పాలన కశ్మీర్‌కే ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లోనైతే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఒక్క జమ్ములో మాత్రం దీనికి మినహాయింపు. రాజ్యాంగంలో 92వ సెక్షన్‌ కింద రాష్ట్రపతి ఆమోదంతో ఆరు నెలల పాటు గవర్నర్‌ పాలన అమలు చేసే వీలుంది. ప్రత్యేక ప్రతిపత్తిని రాజ్యాంగం కల్పించడంతో ఈ ఒక్క రాష్ట్రానికి విడిగా రాజ్యాంగం, నిబంధనలు ఉన్నాయి. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో  356వ రాజ్యాంగ నిబంధన కింద రాష్ట్రపతి పాలన అమలు చేస్తారు. 

1977 నుంచి జమ్ములో గతంలో ఏడు సార్లు గవర్నర్‌ పాలన విధించారు. దివంగత నేత షేక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో 1977 మార్చి 26న మొదటి సారి రాష్ట్రపతి పాలన విధించారు. 105  రోజుల పాటు గవర్నర్‌ పాలన కొనసాగింది. 1986 మార్చిలో రెండోసారి గవర్నర్‌ పాలన 246 రోజుల పాటు కొనసాగింది. 1990 జనవరిలో ముఖ్యమంత్రిగా ఫారూక్ అబ్దుల్లా రాజీనామాతో మూడోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. అత్యంత సుదీర్ఘంగా ఆరు సంవత్సరాల 264 రోజుల పాటు కొనసాగింది. 2002 ఫిబ్రవరిలో నాలుగోసారి 15 రోజుల పాటు, 2008లో ఐదో సారి 174 రోజుల పాటు, 2014లో ఆరోసారి, 2016లో ఏడోసారి గవర్నర్‌ పాలన వచ్చింది. ఇప్పుడు ఎనిమిదో సారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది.. 

ప్రస్తుతం ఎన్‌.ఎన్‌ వోరా పాలన వ్యవహారాలను చూసుకోనున్నారు. అయితే అమర్‌నాథ్‌ యాత్ర ముగిశాక జమ్ము కశ్మీర్‌కు కొత్త గవర్నర్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 28న యాత్ర ప్రారంభమవుతుంది. రెండు నెలల పాటు యాత్ర కొనసాగనుంది. గవర్నర్‌ ఎన్‌.ఎన్‌ వోరాకున్న అపార అనుభవం రీత్యా ఈ సారి కూడా యాత్రకు ఇన్‌ఛార్జ్‌గా ఆయనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో భద్రతా వాతావరణం క్షీణిస్తుండడంతో యాత్రకు గట్టి భద్రత కల్పించడం పెద్ద సవాలే. వోరా 2008 జూన్‌లో గవర్నర్‌గా నియమితులయ్యారు. 2013లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. యూపీఏ హయాంలో గవర్నర్‌గా నియమించినా.. బీజేపీ ఆయన్ను కొనసాగిస్తోంది..
-------------------
మరోవైపు కశ్మీర్‌లో తాజా పరిస్థితులను గమనించిన బీజేపీ ముందుగానే జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. సైనిక చర్యలను నిలివేతను పొడిగిస్తే మొదటికే మోసం వస్తుందని కమలం పార్టీ గ్రహించింది. ఉగ్రవాద సంఘటనలు పెరిగితే దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఓట్లు పోతాయని ఆందోళన చెందింది. అందుకే జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం నుంచి వైదొలగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు తోడు.. 2019 సాధారణ ఎన్నికలనూ దృష్టిలో ఉంచుకునే పి.డి.పితో బంధం తెంచుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉగ్రవాదంపై  కఠిన వైఖరి అనుసరించడానికి పీడీపీతో భాగస్వామ్యం అడ్డంకిగా ఉందని బీజేపీ భావించింది. అందుకే ఉగ్రవాదాన్ని అనచడంలో పీడీపీ పూర్తిగా విఫలమైందని చెప్పి బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com