కువైట్:భారతీయ ఇంజనీర్లకు కొండంత కష్టం

- June 21, 2018 , by Maagulf
కువైట్:భారతీయ ఇంజనీర్లకు కొండంత కష్టం

కువైట్:కువైట్ లో పనిచేస్తున్న వేలాది భారతీయ ఇంజనీర్లకు కొండంత కష్టం వచ్చి పడింది. ఇకపై భారత నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిషన్ (ఎన్ బిఏ) గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ డిగ్రీలు చేసినవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దశాబ్దాలుగా గల్ఫ్ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న ఐఐటీ పట్టభద్రులతో సహా సుమారు 10,000 మందికి పైగా భారతీయ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇకపై వలస వచ్చే ఇంజనీర్లు తప్పనిసరిగా కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ పొందితేనే వారికి వర్క్ పర్మిట్ ఇవ్వాలని గత మార్చిలో కువైట్ మానవ వనరుల శాఖ కార్మిక శాఖను ఆదేశించింది. ఎన్ బీఏ అక్రెడిషన్ గల కోర్సు చేస్తేనే భారతీయ ఇంజనీర్లకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐటీలు, ఐఐఎస్సీ బెంగళూరు, బిట్స్ పిలానీ, జాదవ్ పూర్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సీటీలు ఇచ్చే బీటెక్ డిగ్రీలు పనికి రాకుండా పోవచ్చు. ఎందుకంటే ఈ సంస్థలు కొన్నాళ్ల క్రితం వరకు బీఎస్సీ చదివినవారికి మూడేళ్ల బీటెక్ డిగ్రీలు ఇస్తూ వచ్చాయి. ఇవేవీ తమ ఇంజనీరింగ్ కోర్సులకు ఎన్ బీఏ గుర్తింపు పొందలేదు. బిట్స్ పిలానీ, జేయూ నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) గుర్తింపు పొందాయి. 2010లో ఏర్పడిన ఎన్ బీఏ గుర్తింపు లేదని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక సంస్థల ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లబోవని కువైట్ ప్రభుత్వం ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com