ఒక్కసారి విమాన ప్రయాణం.. కల నెరవేర్చుకునే వేళ.. ఆఫర్ల వెల్లువ

- June 29, 2018 , by Maagulf
ఒక్కసారి విమాన ప్రయాణం.. కల నెరవేర్చుకునే వేళ.. ఆఫర్ల వెల్లువ

చాలా మందికి విమాన ప్రయాణం ఓ కలగా మిగిలిపోతుంది. అవకాశం వస్తే ఆకాశంలో విహరించాలని, గగనతలంలో చక్కర్లు కొట్టాలని ఎవరికి మాత్రం అనిపించదు.. మీ ఆశల్ని, మీ కలల్నీ మేం నెరవేరుస్తాం అంటూ.. ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కొన్ని విమానయాన సంస్థలు. ఓ ప్రణాళిక ప్రకారం ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ మొత్తానికే టికెట్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉందంటున్నాయి.  బుకింగ్స్ ఎక్కువయ్యేకొద్దీ టిక్కెట్ ధర పెరిగే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా ఈ ఆఫర్‌ని వినియోగించుకోమంటున్నాయి. మరి ఆయా సంస్థల ఆఫర్ల వివరాలు చూస్తే..

స్పైస్‌జెట్: స్వదేశంలో ప్రయాణించడానికి రూ.1,149 నుంచి టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ టిక్కెట్లను జులై నెల 30 వరకు కొనుగోలు చేసుకునే వీలుంది. ప్రయాణం జులై 1 నుంచి అక్టోబరు 8 మధ్యలో చేయవలసి ఉంటుంది. ఇండిగో: ఎంపిక చేసిన మార్గాల్లో రూ.1200 నుంచి ధరలు ఉంటాయి. ఇవి కూడా జులై 30 లోపు బుక్ చేసుకోవాలి. ప్రయాణం జులై 11 నుంచి సెప్టెంబరు 27 మధ్య చేసేవారికి అనుకూలం. మధ్యలో ఆగి మరో చోటుకి వెళ్లాలంటే కుదరదు. నాన్‌స్టాప్ గమ్యాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 

ఎయిరేషియా: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణానికి 20 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులో జులై 1 వరకు మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. జులై 2 నుంచి నవంబరు 30 మధ్య ప్రయాణించే సౌలభ్యం ఉంది. వన్‌వేకి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. జెట్ ఎయిర్‌వేస్: స్వదేశీ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే వారికి కనీసధరపై 30 శాతం రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. జులై 30 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. నవంబరు 5 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఆమ్‌స్టర్ డ్యామ్, కొలంబో, పారిస్‌లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. గో ఎయిర్: స్వదేశంలో ప్రయాణానికి రూ.1199 నుంచి టిక్కెట్ ధర ఉంటుంది. జులై 10 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి జులై నెల 30 లోపు కొనుగోలు చేయాలి. ట్రూజెట్: హైదరాబాద్-నాందేడ్ మధ్య ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.899 నుంచి ప్రారంభమవుతుంది. తమ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటే మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలంటే కూడా రాయితీ ఉంటుందని కంపెనీ తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com