బెంగళూరులో 'హెలీ'ట్యాక్సీలు!
- July 01, 2018
నాలుగు చోట్ల హెలీప్యాడ్ల నిర్మాణంప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహణదేశ, విదేశాల నుంచి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకునేవారు.. నగరానికి ఈవల విస్తరించిన ఎలక్ట్రానిక్సిటీ సందర్శించాలంటే రహదారిపై రెండు గంటల ప్రయాణం తప్పదు. హెలీట్యాక్సీలు అందుబాటులోకి వస్తే ఈ వ్యవధి పట్టుమని 15 నిమిషాలకే పరిమితమవుతుంది.బెంగళూరు: నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ-కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య బాడుగ హెలికాప్టర్ సేవలు విజయవంతంగా ఆరంభం కావటంతో స్ఫూర్తిపొందిన బృహత్ బెంగళూరు మహానగర పాలికె బాధ్యులు నాలుగు చోట్ల హెలీపాడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన జనావాసాలున్న బెల్లహళ్లి, బింగిపుర, మైలసంద్ర, బాగలూరు వద్ద వీటి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. పాలికెనే సొంతంగా హెలిపాడ్లను నిర్మించి, నిర్వహించదు. వాటి నిర్మాణానికి కావాల్సిన భూమిని నెలవారీ బాడుగ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో పాలికె కేటాయిస్తుంది. ప్రైవేటు సంస్థలు లేక వ్యక్తులు అక్కడ హెలిపాడ్ నిర్మించి, నిర్వహణ బాధ్యతల్ని కూడా చేపట్టాలి. ప్రాథమిక దశలో హెలి అంబులెన్స్ సేవలకు పరిమితంగా వాటిని వినియోగిస్తారు.
మలిదశలో వాణిజ్య సరళిలో హెలికాప్టర్లు నడుపుతారని బెంగళూరు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. నగరంలో ప్రస్తుతం ప్రైవేటు భవనాలపై 50 వరకూ హెలిపాడ్లు ఉన్నాయి. పౌర విమానయాన శాఖ అనుమతి లభించకపోవటంతో అవి మూలన పడినట్లయ్యింది. ఎలక్ట్రానిక్సిటీ, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య హెలికాప్టర్లో ప్రయాణ వ్యవధి 15 నిమిషాలు.
ఇందుకు చెల్లించాల్సిన రుసుము రూ.3,000 నుంచి రూ.3,500. తాము సేవలు ప్రారంభిస్తే ఆ రుసుము అంతకంటే తక్కువగా ఉంటుందని పాలికె ఉన్నతాధికారులు చెప్పారు. హెలిపాడ్ల నిర్మాణాల్ని చేపట్టదలచిన ప్రదేశాల్లో పాలికెకు స్థలాలు ఉన్నాయి. అక్కడ హెలిపాడ్లను నిర్మించి, నిర్వహించేందుకు పదేళ్ల పాటు బాడుగకు ఇవ్వనుంది.
ఎక్కువ బాడుగ చెల్లించే వారికి ఆ స్థలాల్ని కేటాయిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి, హెలి అంబులెన్సు సేవలకు మాత్రమే తొలిదశలో అనుమతించామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నగరంలో మొత్తం ఎనిమిది చోట్ల రెండు దశల్లో వీటిని నిర్మించదలిచారు. ప్రస్తుతం ఎంపిక చేసిన నాలుగు ప్రదేశాలు ఒకప్పుడు క్వారీలు.
ఒక్కో హెలిపాడ్ నిర్మాణానికి 30 అడుగుల వ్యాసమున్న ప్రదేశం సరిపోతుంది. వాటి నిర్వహణకు సంబంధించి సాంకేతిక అధ్యయనం చేస్తున్నారు. అది ముగిసిన తర్వాత పౌరవిమానయాన అనుమతికి ప్రతిపాదనల్ని పంపిస్తామని అధికారులు చెప్పారు. సానుకూల స్పందన లభించిన వెంటనే-ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికే కాకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపారులు, రాజకీయ నాయకుల రాకపోకలకు ఇవి ఉపయుక్తమవుతాయని వివరించారు. చలనచిత్రాలు, టెలివిజన్లకు చిత్రీకరణకూ అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇందువల్ల పాలికెకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..