నేస్తం !

- December 12, 2015 , by Maagulf

 

మనిషి ఎదుగుతున్నాడు 

హోదా పెంచుకుంటున్నాడు 
డబ్బు విరివిగా గడిస్తున్నాడు 
ఆస్తులను అంచనాలకు మించి 
అమర్చుకుంటున్నాడు
కానీ తాను పెంచుకున్న వేళ్ళు
ఏ మట్టివో మరచిపోతున్నాడు
గింజగా మొదలైన జీవితం 
పెద్ద మానుగా మారింది 

నిజమే!ముమాటికీ నిజమే! 
కానీ ఆ గింజను కడుపులో 
దాచుకున్నదీ 
నీళ్ళు ఇచ్ఛీ నిలకడని ఇచ్చీ 
అనుక్షణం కాపాడిన 
నేలతల్లిని మరచిపోతున్నాడు 

ఎండకూ వానకూ 
రెపరెపలాడుతున్న 
మొక్క ప్రాణాన్ని 
తన బలంతో పెంచుకున్న 
తల్లి భూమిని 
గుర్తు పెట్టుకోడు!

తల్లీదండ్రి 
వ్రుద్దులైపోయాక 
వారి కర్మకు వాళ్ళను 
వదిలేసిన సంతానం 
ఏమనాలి వాళ్ళని మనం?

బ్రతుకంతా ధారపోసి 
కంటికి రెప్పలా కాచిన
తల్లిదండ్రులు 
అవుతున్నారు నేడు గుదిబండలు 
మనం ఇవ్వాళ సరే!
రేపేమిటి?

మనమూ తల్లిదండ్రులమే 
మనకూ ఉన్నారు పిల్లలు 
వాళ్ళు నేర్చుకుంటున్నారు 
మననుండే బుద్ధులు 
ఆ జీవిత సంధ్యా
సమయాన 
మన మనుగడ ఏమిటి?

మన ఆస్తీ మన సంపద
మన హోదా మన పదవి 
అక్కరకు వస్తాయా నేస్తం?

ఈ నిజం గ్రహించుకో!
నీ బాధ్యతను పంచుకో!
నలుగురిలో ఒక ఆదర్శం 
ఒక మణిదీపంగా 
మెలిగి వెలిగిపో!

            ----- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com