విషమించిన కరుణానిధి ఆరోగ్యం..

- July 29, 2018 , by Maagulf
విషమించిన కరుణానిధి ఆరోగ్యం..

డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన ఆరోగ్యంపై నిన్న రాత్రి కావేరీ ఆస్పత్రి వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం తాత్కాలిక కుంగుబాటుకు గురైందని.. అయితే వైద్య సహకారం అందుతుండటంతో కీలక అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కరుణానిధి పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

కలైంజర్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో డీఎంకే శ్రేణులు పెద్దఎత్తున కావేరి ఆస్పత్రికి తరలి వస్తున్నాయి. దీంతో కరుణ ఆరోగ్యంపై పుకార్లను నమ్మవద్దని డీఎంకే నేత రాజా విజ్ఞప్తి చేశారు. అయితే వైద్యులతో పాటు, ఇతరులు చెప్పే మాటలను తాము నమ్మేది లేదని… స్టాలిన్‌ తమతో నేరుగా మాట్లాడాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్ద భైఠాయించారు. వీరికి సర్దిచెప్పి వెనక్కి పంపడానికి పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎంకే కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడకుండా శాంతించాలంటూ స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు.

మరోవైపు తమిళనాడు అంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి ఆరోగ్యం విషమించినట్టు వదంతులు వ్యాపించడంతో… చెన్నై నగరంతో పాటు, రాష్ట్రమంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు. కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ భద్రతా సిబ్బందిని మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరుణానిధి చికత్స తీసుకుంటున్న కావేరి ఆస్పత్రి దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ఆస్పత్రికి వెళ్లే అన్ని మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు సేలం పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన కార్యక్రమాన్ని అకస్మికంగా రద్దు చేసుకుని చెన్నైకి చేరున్నారు. పళనస్వామి ఇవాళ అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. ఆయన కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువురు ప్రముఖులు కూడా కరుణానిధి కుటుంబసభ్యులను కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com