రన్నింగ్‌ బస్సులోంచి కిందపడి వ్యక్తి మృతి

- August 14, 2018 , by Maagulf
రన్నింగ్‌ బస్సులోంచి కిందపడి వ్యక్తి మృతి

ఫుట్‌పాత్ ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటమే. ఇదొక్కటే కాదు.. అప్రమత్తంగా లేకపోతే సిటీ బస్‌ లోపల నుంచున్నా కొన్నిసార్లు ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రాణాలు తీస్తుంది. రన్నింగ్‌ బస్సులోంచి ఓ వ్యక్తి కింద పడిపోయాడు. నేరుగా తల నేలను తాకడంతో బలమైన గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు నిలబడలేదు. జర్నీ టైమ్‌లో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పడానికి ఈ దుర్ఘటన ఓ హెచ్చరికలాంటిదే. హైదరాబాద్ హైటెక్‌సిటీ దగ్గర్లోని వేవ్‌రాక్ బస్‌స్టాప్ వద్ద ఓ సిటీబస్సు ఆగింది. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కాసేపు వేచి చూశాక తిరిగి అక్కడి నుంచి బయలుదేరింది. డ్రైవర్ బస్సును యూటర్న్ చేస్తుండగా.. ఆ స్పీడ్‌కి లోపలున్న కండెక్టర్ పట్టు కోల్పోయాడు. ఒక్కసారిగా తూలి పడిపోయాడు. ఆ టైమ్‌కి ఆయన మెట్ల దగ్గర ఉండడంతో నేరుగా బయటకు పడిపోయాడు. తల నేలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

కదులుతున్న బస్సులో బ్యాలెన్స్‌గా నుంచోవడం కండెక్టర్లకు అలవాటైపోతుంది. ఓ పక్క టికెట్లు ఇస్తూనే.. టర్నింగుల్లోనూ, బస్సు గోతుల్లో పడ్డ సమయంలోనూ పట్టుకోల్పోకుండా నుంచోగలుగుతారు. కానీ ఎంత సీనియర్లైనా, ఎంత అలవాటైనా సరే, అన్నిసార్లు టైమ్ మనకు అనుకూలంగా ఉండదు అని చెప్పడానికి ఈ ప్రమాదమే ఉదాహరణ. బస్ యూటర్న్ తీసుకునే సమయంలో సీట్ హ్యాండిల్‌ను కానీ, వేరే రాడ్‌ను కాని పట్టుకుని ఉంటే కండెక్టర్ ప్రాణాలు నిలబడి ఉండేవి. బస్ ఖాళీగా ఉంది కాబట్టి కూర్చుని ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. కానీ, అలవాటైన ప్రయాణమే కదా అన్న ఆదమరుపు చివరికిప్పుడు ప్రాణాలు పోవడానికి కారణమైంది.

యూటర్న్‌ తీసుకునే సమయంలో డ్రైవర్ కొంచెం వేగంగా వెళ్లడం.. అదే టైమ్‌లో కండెక్టర్ అప్రమత్తంగా లేకపోవడం ఈ విషాదానికి కారణమైంది. కండెక్టర్ పడిపోయిన విషయాన్ని క్షణాల్లోనే గమనించిన డ్రైవర్.. వెంటనే బస్ ఆపి పరుగుపరుగున వచ్చి చూసినా.. అప్పటికే అతను ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లతో కలిసి వెంటనే అతన్ని సాయంపట్టి బస్ ఎక్కించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐతే, చికిత్స పొందుతూ కండెక్ట్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com