అమరావతి:మైనార్టీల సభకు సర్వం సిద్ధం

- August 27, 2018 , by Maagulf
అమరావతి:మైనార్టీల సభకు సర్వం సిద్ధం

నారా హమారా.. టీడీపీ హమారాకు గుంటూరు ముస్తాబైంది. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బహిరంగ సభకు తెలుగుదేశం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ కార్యక్రమంగా వేదికగా మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ముస్లింలు తమకు అండగా ఉన్నారన్న సంకేతాన్ని బీజేపీకి పంపించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహిస్తున్నారు.

ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన పనులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నారా హమారా.. టీడీపీ హమారా పేరుతో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ సభ జరుగనుంది. సీఎం చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు, పలువురు మంత్రులతో పాటు మైనార్టీ నాయకులు హాజరు కానున్నారు.

నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమం కోసం టీడీపీ పెద్ద కసరత్తే చేసింది. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహించింది. వీటిని పూర్తిచేశాక ఇప్పుడు బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ నాలుగేళ్లలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా ముస్లిం మైనారిటీలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించనున్నారు. అదే సమయంలో దేశం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను కూడా వివరించి ముస్లిం మైనారిటీలను చైతన్యపరుస్తారు.

రాష్ట్రంలోని మైనారిటీలు వంద శాతం టీడీపీతోనే ఉన్నారని కళావెంకట్రావు తెలిపారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబులతో కలిసి ఆయన పరిశీలించారు. మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.

గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప.. వారి అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవని మంత్రి ప్రత్తిపాటి చెప్పారు. ప్రధాని మోదీని ఢీ కొట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు. ఈ సభతో మైనారిటీల సత్తా ఏమిటో, తెలుగుదేశం ధైర్యమేమిటో మోదీకి తెలియజేస్తామన్నారు.

ఈ కార్యక్రమానికి సుమారు లక్షమంది ముస్లింలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… నమాజ్‌ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com