ఏ.పి,తెలంగాణ రాష్ట్రాల్లో అమెజాన్‌ స్టోర్లు

- August 28, 2018 , by Maagulf
ఏ.పి,తెలంగాణ రాష్ట్రాల్లో అమెజాన్‌ స్టోర్లు

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ అమ్మకాలకు పరిమితమైన అమెజాన్‌ కొత్తగా 'అమెజాన్‌ ఈజీ' పేరుతో ఆఫ్‌లైన్‌ స్టోర్ల ఏర్పాటుకు సిద్దం అయ్యింది. వీటిని తొలుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనే అందుబాటు లోకి తెస్తోన్నట్లు వెల్లడించింది. స్థానిక రిటైలర్లు, ఔత్సాహికవేత్తలతో కలిసి ఈ షాపింగ్‌ అనుభవాన్ని అందించనున్నామని అమెజాన్‌ ఇండియా కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోట వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తొలుత 200 స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా తెలంగాణలోని వరంగల్‌, నల్గొండలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మధ్య నాటికి దేశ వ్యాప్తంగా 14,000 స్టోర్లను ఏర్పాటు చేయనున్నా మన్నారు. ఈ సేవలను అందించడానికి రవాణ, రిటైల్‌ స్టార్టప్స్‌, కిరాణ స్టోర్లు, మెడికల్‌ స్టోర్లు, మొబైల్‌ షాపింగ్‌, చిన్న వ్యాపారాల వర్గాలతో కలిసి పని చేయనున్నామన్నారు.

ఈ స్టోర్‌ యాజమానులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. వారికి కొనుగోలుదారులను వెతికి ఇవ్వనున్నామని, ఇందుకు కొంత కమిషన్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వచ్చే పండుగ సీజన్‌ కల్లా 10 కోట్ల ఆన్‌లైన్‌ వినియోగదారుల్లో తాము కీలక పాత్ర పోశించాలని నిర్దేశించుకున్నామన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ఇ-కామర్స్‌ పరిశ్రమ వినియోగదారులు ప్రస్తుత 10 కోట్ల నుంచి 20 కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు.

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు తగ్గుతున్నారని రిపోర్టులు వస్తున్నప్పటికీ తాము మాత్రం వృద్ధిపథంలోనే ఉన్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com