తెలంగాణలో నవంబర్ లోనే ఎన్నికలకు ఈసీ సమాయత్తం
- September 10, 2018
తెలంగాణలో ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సీఈసీకి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం… ఇవాళ నగరానికి వస్తోంది. రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి.. ఎన్నికల నిర్వహణ పరిస్థితులు, వసతులపై అధ్యయనం చేయనుంది.
సాయంత్రం హైదరాబాద్ రానున్న ఈసీ అధికారుల బృందం సచివాలయంలో ఆరున్నర నుంచి ఎనిమిదిన్న వరకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అవుతుంది. ఈ భేటీకి హాజరుకావాలంటూ ఒక్కో పార్టీ నుంచి ఇద్దరూ లేదా ముగ్గురు ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఒక్కో పార్టీకి ఈసీ బృందం 10 నిమిషాల సమయం కేటాయించింది. ఆ తర్వాత తొమ్మిదిన్నర వరకు పోలీస్, ఆబ్కారీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రేపు జలమండలి ఆఫీస్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. రేపు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు సీఎస్, డీజీపీతో చర్చలు జరపనున్నారు. ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, ఎన్నికల సిబ్బంది, బందోబస్తుకు అవసరమైన బలగాలు సహా అన్ని అంశాలపై చర్చిస్తారు. అన్ని శాఖలతో సమీక్ష అనంతరం ఉమేష్ సిన్హా నేతృత్వంలోని బృందం.. మీడియాకు వివరాలు వెల్లడిస్తుంది.
కేంద్ర ఎన్నికల బృందం పర్యటన నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకుంది. నిన్న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసింది. ఈ జాబితాపై సెప్టెంబర్ 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంది. అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పింది. మార్చిలో ఇచ్చిన ముసాయిదా ప్రకారం తెలంగాణలో రెండుకోట్ల 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కోటి 28 లక్షల మంది పురుషులు కాగా.. కోటి 24 లక్షల మంది మహిళా ఓటర్లు. 2014 ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం 36 లక్షల ఓట్లు తగ్గాయి. సీమాంధ్ర వాసులు ఏపీకి వెళ్లిపోవడంతో పాటు వడపోత కారణంగా ఓటర్ల సంఖ్య తగ్గినట్లు అధికారులు చెప్తున్నారు. తాజాగా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించడంతో.. ఫైనల్ లిస్ట్ సిద్ధమయ్యే నాటికి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
మరోవైపు ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌ను.. టీఎస్ ఎన్నికల అధికారి రజత్ కుమార్ కలిశారు. ఐదున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎన్నికల నిర్వహణ, సంసిద్ధత అంశాలను ఈసీకి వివరించామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇక.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ దిశగా సన్నద్ధత, ఏర్పాట్లపై సమీక్షించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







