ఓపెన్‌ అయిన నిరుద్యోగభృతి వెబ్‌సైట్‌.!

- September 14, 2018 , by Maagulf
ఓపెన్‌ అయిన నిరుద్యోగభృతి వెబ్‌సైట్‌.!

నిరుద్యోగుల కల సాకారం అయ్యింది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు రాక దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతకు కొండంత భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ప్రారంభమైంది. శుక్రవారం ఆరు గంటలకు ఈ పథకానికి సంబంధించి వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయింది. దీంతో నిరుద్యోగుల్లో పట్టరాని ఆనందం నెలకొంది. జిల్లాలో 94 వేల మంది నిరుద్యోగులున్నారని ప్రాథమిక అంచనా. వీరందరికీ ప్రభుత్వం నెలకు రూ.1000 చొప్పున భృతి చెల్లించబోతోంది.

మచిలీపట్నం జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యోగార్థులు ఉన్నారు. కనీసం డిగ్రీపైబడి చదువుకున్న వారంతా చిన్నపాటి ఉద్యోగం చేస్తూ, పొట్టపోసుకుంటున్నారు. ఆ ఉద్యోగాలన్నీ వారికి రోజు వారీ కూలి సమకూర్చేవే తప్ప.. నెల వారీగా, నిబంధనలకనుగుణంగా జీతాలు తెచ్చిపెట్టేవి కాదు. దీంతో సముపార్జించిన ఆ చిన్నమొత్తాలతోనే జీవనం గడపలేక నానా అవస్థలు పడుతున్నారు. మరో వైపు ఏదో ఒక ఉద్యోగం రాకపోదా అంటూ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కోకొల్లలు. డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ చదివిన అనేక మంది ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. జిల్లాలో వీరి సంఖ్య, నిరుద్యోగ భృతికి అర్హులు దాదాపు 94 వేలపైబడి ఉంటారని ప్రాథమిక అంచనా. ఉపాఽధి కార్యాలయంలో ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 70, 792 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధి కార్యాలయంలో నమోదు కాని వారి సంఖ్య భారీ గానే ఉంది. నమోదైన వారు, వివిధ రకాల పద్ధతులనుసరించి రూపొందించిన జాబితా ప్రకారం జిల్లాలో 90 వేల పైబడి అభ్యర్థులున్నారు. వీరందరికీ ప్రభుత్వం యువనేస్తం కింద నిరుద్యోగ భృతి కల్పించబోతోంది.

నిరుద్యోగుల కళ్లలో ఆనందం నింపేందుకు ప్రభుత్వం యువనేస్తంతో నెలకు రూ. 1000 భృతి అందించనుంది. జిల్లాలో ప్రాథమిక అంచనా వేసిన 94వేల మంది అభ్యర్థులకూ నెలకు రూ. 1000 చొప్పున భృతి ఇవ్వాల్సిందే. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడబోతోంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పింఛనుదారులకు భారీ మొత్తంలో ప్రభుత్వం నగదు ఇస్తోంది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు లక్షల ఐదు వేల మంది సామాజిక భద్రత పింఛన్‌ అందుకుంటున్నారు. వీరికి ప్రతినెలా సరాసరి రూ. 43 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదే క్రమంలో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అందించనుంది. 94వేల మందికి కలిపి సుమారు రూ. తొమ్మిదిన్నర కోట్లను ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ అదనపు భారాన్ని భరించి మరీ నిరుద్యోగుల కళ్లలో ఆనందం నింపబోతోంది.

అర్హతలు:

రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. రాష్ట్రంలోనే నివసించాలి

వయస్సు 22 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి

తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. దాంట్లో పేరుండాలి

ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి

డిగ్రీ లేదా పాలిటెక్నిక్‌ ఆపై పూర్తి చేసిన వారే అర్హులు

బ్యాంకు ఖాతా, మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌కు అనుసంధానమై ఉండాలి.

అనర్హతలు

కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఉండకూడదు

ప్రభుత్వం నుంచి గతంలో సబ్సిడీ రుణాలు పొందిన వారు అనర్హులు(రూ. 50 వేల పైబడి)

కారు, ఇతర నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు

కుటుంబంలో(తల్లిదండ్రులు) సామాజిక పింఛను తీసుకుంటున్నా అనర్హులే

ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉన్నా అనర్హులే

క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.

దరఖాస్తు చేసే విధానం ముందుగా నెట్‌లోకి వెళ్లి యువనేస్తం. ఏపీ.జీవోవీ.ఇన్‌కు లాగిన్‌ అవ్వాలి. తర్వాత రిజిస్టర్‌ బటన్‌ కనపడుతుంది. అక్కడ నిరుద్యోగి ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలంటూ ఒక కాలమ్‌ కనపడుతుంది. వెంటనే ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే.. క్లిక్‌ హియర్‌ అంటూ కింద రెడ్‌ మార్క్‌లో ఒక లేబుల్‌ ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేయగానే ఆధార్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మళ్లీ ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, కింద ఇచ్చిన టెక్స్ట్‌ను ఎంటర్‌ చేసి, క్లిక్‌ చేస్తే.. ఆధార్‌ వివరాలు వస్తాయి. ఆధార్‌ వివరాలు వస్తేనే, దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత రిజిస్టర్‌ బటన్‌ వద్దకు వెళ్లి, ఆధార్‌ను అథంటికేషన్‌కు క్లిక్‌ చేయాలి. తర్వాత పర్సనల్‌ డిటైల్స్‌ వస్తాయి. పేరు, అడ్రస్‌, ఫోటో అన్ని వివరాలు కనపడతాయి. ఎడ్యుకేషన్‌ వివరాలు కూడా వస్తాయి. ఇక్కడే మీరు అర్హులో, అర్హులు కాదో తెలిసిపోతుంది. అర్హులు కాకపోతే ఎందుకు కాదో వివరాలు కూడా వస్తాయి. విద్య వివరాలు అప్‌లోడ్‌ కాకపోతే చూపిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com