త్వరలో బెంగుళూరు లో పొడ్‌ టాక్సీలు.!

- September 15, 2018 , by Maagulf
త్వరలో బెంగుళూరు లో పొడ్‌ టాక్సీలు.!

హైటెక్‌ సిటీలో సంచార రద్దీ నియంత్రణకు పొడ్‌ టాక్సీలను పరిచయం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను బెంగళూరు మహానగర పాలికె సిద్ధం చేసింది. మొదటి దశలో ట్రినిటి కూడలి నుంచి హెచ్‌.ఎ.ఎల్‌. వరకు దీన్ని ప్రవేశపెట్టనున్నారు. రహదారి పక్క తీగపై సంచరించే పొడ్‌ టాక్సీలు ప్రస్తుతం విదేశాల్లో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఒకేసారి 25 మంది ఇందులో వెళ్లే అవకాశం ఉంది. మొదటి దశ నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియను పాలికె పూర్తి చేసింది. రూ.3 వేల కోట్లతో పనులు చేపట్టడమే తరువాయి. సంచార రద్దీ ఉండే రహదారుల్లో పొడ్‌ టాక్సీలు తిరిగే విధంగా పనులు చేపట్టనున్నారు. గత రెండేళ్ల నుంచి దీని అమలుపై అధికారులు తర్జన భర్జన పడ్డారు. మెట్రో రైలు ఉండగా పొడ్‌ టాక్సీలు ఎందుకని కొందరు ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. మెట్రో రైలు లేని ప్రాంతాలకు మోనో, పొడ్‌ టాక్సీలను ప్రవేశపెట్టాలని తీర్మానించారు. మోనో రైలు ఎక్కువ ఖర్చుతో కూడినది కావడంతో పొడ్‌ టాక్సీ సంచారం వైపు పాలికె అధికారులు మొగ్గుచూపారు.

బయ్యప్పనహళ్లి నుంచి ట్రినిటి కూడలి, హెచ్‌.ఎ.ఎల్‌, మారతహళ్లి మీదుగా వైట్‌ఫీల్డ్‌ వరకు 18 కిలోమీటర్ల మేరకు ఈ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అందుకు ఫ్రాన్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకున్నారు. ఆ దేశ నిపుణుల సహాయంతో ఈ ప్రణాళికను అమలు చేస్తారు.
* పొడ్‌ టాక్సీ సంచార మార్గం నిర్మాణానికి భూస్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రహదారి పక్కన స్తంభాలు ఏర్పాటు చేసి, వాటికి అయస్కాంతంతో కూడిన తీగల్ని లాగాలి.

విద్యుత్తు సహాయంతో టాక్సీలు నడుస్తాయి. పనులు ప్రారంభిస్తే కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయవచ్చునని అధికారులు తెలిపారు. ప్రయాణికులు దిగేందుకు అక్కడక్కడ ఎత్తయిన పాట్‌ఫారాలు నిర్మించాలి. దానికి పెద్దగా భూమి అవసరం ఉండదని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడమే తరువాయి. టాక్సీలు అమలులోకి వస్తే సంచార రద్దీ కొంత మేరకు అదుపులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com