ఆసియా కప్‌లో ఆధిపత్యం ఎవరది?

- September 16, 2018 , by Maagulf
ఆసియా కప్‌లో ఆధిపత్యం ఎవరది?

యూ.ఏ.ఈ:వన్డే ట్రోఫీల ప్రపంచంలో సరికొత్త పంథాకు తెరలేపింది ఆసియా కప్. 1983 కాలంలో మొదలై దినదినాభివృద్ధి చెందుతోంది. దేశాల్లో స్నేహశీలత, క్రికెట్‌పై అభిరుచి పెంచేందుకు ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీని ప్రవేశపెట్టారు. 1983-84లో మూడు జట్లు భారత్, పాకిస్తాన్, శ్రీలంకలతో ఈ టోర్నీ ఆరంభమైంది. ఆ తర్వాత పసికూనగా భావించిన బంగ్లాదేశ్‌ ఇప్పుడు తీవ్ర పోటీనిచ్చే జట్టుగా మారింది.

హంగ్ కాంగ్‌, ఒమన్‌, యూఏఈ, నేపాల్‌, అఫ్గాన్‌ జట్లకు ఆసియాకప్‌ గొప్ప వేదికగా మారింది. అంతేకాదు, పసికూనలకు ఆసియాకప్‌ పెద్ద వేదికగా మారింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నాలుగు సార్లు, హాంకాంగ్‌ మూడు సార్లు, అఫ్గానిస్థాన్‌ ఒకసారి ఆసియాకప్‌ లీగ్‌ దశలో ఆడాయి. ప్రస్తుతం దుర్భేద్యమైన స్పిన్నర్లు, చక్కని బ్యాట్స్‌మెన్‌తో అఫ్గానిస్థాన్‌ గట్టి పోటీదారుగా తయారైంది. ఆ దేశం గతేడాది టెస్టు హోదా దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈసారి ఒమన్‌, నేపాల్‌, మలేసియా, సింగపూర్‌ దేశాలు అర్హత టోర్నీ ఆడాయి. తమ ప్రతిభను చాటేందుకు దీనిని చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఆసియా కప్‌ను 13 సార్లు నిర్వహించగా భారత్‌ 12 సార్లు పాల్గొంది. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 మొత్తం ఆరు సార్లు విజేతగా అవతరించి ఆసియా రారాజుగా అవతరించింది. దాయాది పాకిస్థాన్‌లో తిరుగులేని బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ ఉన్నా టీమిండియాకు ఎక్కువ పోటీనిచ్చింది మాత్రం శ్రీలంకనే.

ఆ జట్టు 1986, 1997, 2004, 2008, 2014లో టైటిళ్లు గెలిచింది. పాక్‌ మాత్రం 2000, 2012లో విజేతగా నిలిచింది. పసికూనగా అడుగులు మొదలుపెట్టిన బంగ్లా 2012, 2016లో రన్నరప్‌గా అవతరించి సంచలనం సృష్టించింది. ప్రత్యేకత ఏంటంటే భారత్‌, శ్రీలంక జట్లు ఎనిమిది సార్లు ఫైనల్లో తలపడ్డాయి. ఐదు సార్లు టీమిండియా గెలిస్తే మూడు సార్లు లంక కప్పు కైవసం చేసుకుంది. 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా విజేతగా ఆవిర్భవించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com