టైఫూన్‌ మంగుట్‌ విలయ తాండవం

- September 16, 2018 , by Maagulf

మాంగ్కూట్ టైఫూన్ తీరం దాటడంతో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు దక్షిణ చైనాను కుదిపేస్తున్నాయి. అత్యధిక జనాభా ఉన్న గువాంగ్‌డాంగ్ ప్రావిన్సుకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన అధికారులు అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఇక్కడ ఈ తుపాను వల్ల ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తుపాను హాంగ్‌కాంగ్ తీరాన్ని తాకినప్పుడు వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గువాంగ్‌డాంగ్‌లో రెడ్ అలర్ట్

ఇప్పటికే, ఈ తుపాను మూలంగా ఫిలిప్పీన్స్‌లో 49 మందికి పైగా చనిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది ఇంకా తెలియడం లేదు. మాంగ్కూట్ తుపాను తీవ్రత తీరం దాటిన తరువాత కొంత తగ్గినప్పటికీ, 2018లో వచ్చిన అత్యంత బలమైన తుపాను ఇదేనని అధికారులు అంటున్నారు.
 
చైనా ముందుజాగ్రత్తలతో సిద్ధంగా ఉందా?

హాంగ్‌కాంగ్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలంతా ఇంటిపట్టునే ఉండాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో గాలులు పదే పదే గంటకు 117 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటున్నాయి. కొన్ని చోట్ల అపార్టుమెంట్ల కిటికీలు గాలికి కొట్టుకుపోయాయి. 
షాపులు, ప్రజాసేవలన్నీ మూసేశారు. హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 800లకు పైగా విమానాలను రద్దు చేశారు. ఫలితంగా లక్ష మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు.

ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలు చాలా వరకు బయటకు రాలేదు. "నేను ఈ ఉదయం వాకింగ్‌కు వెళ్ళాను. నాకు తాజా గాలి అంటే ఇష్టం. కానీ, వీధుల్లో ఎవరూ కనిపించలేదు. ఒక్క కారు కూడా లేదు. మామూలు రోజుల్లో ఇలాంటి దృశ్యమే కనిపించదు" అని హాంగ్‌కాంగ్ వాసి హోవో చెన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

పొరుగున ఉన్న మకావు నగరంలోని కేసినోలను మూసివేయాలని అధికారులు అదేశించారు. ఇలా జరగడం ఈ నగరంలో ఇదే తొలిసారి. ఆదివారం నాడు మాంగ్కూట్ టైఫూన్ అడుగుపెడుతున్న గువాంగ్‌డాంగ్ ప్రావిన్సు నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాదిలో వచ్చిన 22వ టైఫూన్ ఇదని అధికారులు చెప్పారు. అయితే, ఇది అత్యంత బలమైన తుపానుగా పరిణమించే అవకాశం ఉందని చైనా వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com