ఆసియా కప్:బంగ్లాపై భారత్‌ ఘన విజయం

- September 21, 2018 , by Maagulf
ఆసియా కప్:బంగ్లాపై భారత్‌ ఘన విజయం

దుబాయ్‌: ఆసియా కప్‌లో రోహిత్‌ శర్మ (83 నాటౌట్‌; 104 బంతుల్లో 5×4, 3×6) కనువిందు చేశాడు. తన సొగసరి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. అతడికి తోడుగా శిఖర్ ధావన్‌ విజృంభించడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది. ఇంకా 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్‌ విజయ తీరాలను చేరింది. మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ (33; 37 బంతుల్లో 3×4) రోహిత్‌కు తోడుగా నిలిచాడు. అంతకు ముందు జడేజా (4), భువి (3), బుమ్రా (3) బంగ్లా నడ్డి విరిచారు. మెహది హసన్‌ (42; 50 బంతుల్లో 2×4, 2×6), మొర్తజా (26; 32 బంతుల్లో 2×4), మహ్మదుల్లా (25; 51 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు.

లక్ష్య ఛేదనను భారత్‌ ధాటిగా ఆరంభించింది. ధావన్‌ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రోహిత్‌ నిలకడగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అర్ధశతకానికి చేరువైన గబ్బర్‌ను 14.2వ బంతికి షకిబ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతే మొదలైంది రోహిత్‌ బాదుడు. కళ్లు చెదిరే బౌండరీలు, సిక్సర్లు ఉతికేశాడు. ఓ భారీ సిక్సర్‌తో అర్ధశతకం సాధించాడు. అంబటి రాయుడు (13; 28 బంతుల్లో 1×4) కాసేపే ఉన్నాడు. విజయ సమీకరణం సులభంగానే ఉండటంతో దినేశ్‌ కార్తీక్‌ (1; 3 బంతుల్లో) బదులు ఎంఎస్ ధోనీని బ్యాటింగ్‌కు పంపించారు. అతడు బంతికో పరుగు చొప్పున సాధించాడు. హిట్‌మ్యాన్‌, ధోనీ మూడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com