దేవదాస్‌:రివ్యూ

దేవదాస్‌:రివ్యూ

చిత్రం: దేవదాస్‌
నటీనటులు: నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్‌, రష్మిక, కునాల్‌ కపూర్‌, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: షమదత్‌ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి
నిర్మాత: అశ్వనీదత్‌
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య 
సంస్థ: వైజయంతీ మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 27-09-2018
ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్‌ల జోరు పెరిగింది. రాబోయే కాలమంతా ఇదే ట్రెండ్‌ కొనసాగనుంది. అగ్ర కథానాయకులందరూ యువ హీరోలతో కలిసి తెరను పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునలాంటి స్టార్‌ హీరో నానితో కలిసి చేసిన చిత్రం 'దేవదాస్‌'. 'శమంతకమణి'తో మేజిక్‌ చేసిన యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. 'గుండమ్మకథ'లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల కెమిస్ట్రీ ఎలా ఆకట్టుకుంటుందో అదే స్థాయిలో 'దేవదాస్‌' కూడా అలరిస్తుందని చిత్ర బృందం చెబుతూ వస్తోంది. అందుకు తగినట్టుగానే ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయి. మరి, నాగ్‌-నానిల కెమిస్ట్రీ ఎలా ఉంది? వారి జోడీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య టేకింగ్‌ ఎలా ఉంది?

కథేంటంటే: దేవ(నాగార్జున) అంతర్జాతీయ మాఫియా డాన్. తనకు తండ్రిలాంటివాడైన దాదా(శరత్‌కుమార్‌)ను ఓ ముఠా చంపేస్తుంది. వారిని వెతుక్కుంటూ హైదరాబాద్‌ వస్తాడు. హైదరాబాద్‌లో దేవను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో దేవపై కాల్పులు జరుపుతారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో దేవ.. దాస్‌(నాని) అనే ఓ వైద్యుడి వద్దకు వెళ్తాడు. దేవను దాస్‌ రక్షిస్తాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దేవ వల్ల దాస్‌ మారాడా? దాస్‌ వల్ల దేవ మారాడా? దేవనే దాస్‌పై ప్రభావం చూపాడా? దాస్‌కు ఉన్న ప్రేమ కథలేంటి? అన్నదే సినిమా.
ఎలా ఉందంటే: ఇద్దరు హీరోలను ఒకేసారి తెరపై చూడటం సినిమా అభిమానులకు ఓ పండగలా ఉంటుంది. వారి నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో వాటన్నింటినీ మేళవించి పొందుపరిచిన సినిమా 'దేవదాస్'. కథపరంగా చిత్రబృందం ప్రయోగాలేమీ చేయలేదు. మనకు తెలిసిన మామూలు కథనే ఎంచుకున్నారు. ఓ హాలీవుడ్‌ సినిమాకు స్ఫూర్తి కూడా అనుకోవచ్చు. ప్రాణాపాయంలో ఉన్న ఓ డాన్‌ను అతి సాధారణమైన, నిజాయతీపరుడైన, మంచివాడైన వైద్యుడు కాపాడితే.. వారిద్దరి మధ్య ఓ స్నేహం ఏర్పడితే.. ఆ స్నేహం వారిద్దరి జీవితాల మీద ఏ విధంగా ప్రభావం చూపింది. జీవితం గురించి వీరిద్దరూ తెలుసుకున్నదేంటి? నేర్చుకున్నదేంటి? అనేదే 'దేవదాస్‌' కథ.

సినిమా ప్రారంభం చాలా గంభీరంగా ఉంటుంది. దేవ ఎవరు? అతను ఎప్పుడొస్తాడు? అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతుంది. దాస్‌ ఎంట్రీతో నవ్వులు మొదలవుతాయి. దేవ, దాస్‌ ఇద్దరూ కలిసినప్పుడు ఆ నవ్వులు పండి మరింత జోరు అందుకుంటుంది. నాగార్జున, నానిల మధ్య సన్నివేశాలే ఈ చిత్రానికి బలం. అవన్నీ ఆద్యంతం హాయిగా నవ్విస్తాయి. కొన్ని గుండెల్ని హత్తుకునేలా ఉంటాయి. దేవ, దాస్‌ల ప్రేమకథలు సరదాగా సాగిపోతాయి. ద్వితీయార్ధం కొంచెం భారంగా సాగుతుంది. అందులో అవయవదానం ఎపిసోడ్‌ను కూడా చిత్రించారు. ఈ సన్నివేశం వెనక ఉన్న ఉద్దేశం బాగున్నా, సరదాగా సాగే సినిమా ఒక్కసారిగా సీరియస్‌ టర్న్‌ తీసుకున్నట్లు అనిపిస్తుంది. దేవ మారిపోవడం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో యథావిధిగా వినోదాన్ని జోడించి ఒక మంచి ముగింపు ఇచ్చారు.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాకు నాగ్‌, నాని మూలస్తంభాలు. ఎప్పటిలాగే తమ పాత్రలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. నాగ్‌ లుక్‌ బాగుంది. గత చిత్రాలకన్నా అందంగా కనిపించారు. నాని కామెడీ టైమింగ్‌ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. నాగ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాలూ, వారి నటన, ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ ఈ సినిమాను నడిపించింది. గత సినిమాలతో పోలిస్తే రష్మిక కు అంతగా ప్రాధాన్యం లేని పాత్ర దక్కిందనే చెప్పాలి. రష్మిక పాత్రకు సంబంధించి ఓ ట్విస్ట్‌ ఉన్నా, అది అంతంగా రక్తికట్టలేదు. ఆకాంక్ష సింగ్‌ పాత్ర.. రష్మిక పాత్ర కంటే మరీ చిన్నది. హీరోయిన్లు ఇద్దరూ అతిథి పాత్రల్లాగే కనిపిస్తారు. రావు రమేశ్‌, సత్య, నరేశ్‌, మురళీ శర్మలవి కూడా చిన్న పాత్రలే. ఈ సినిమాను రంగుల హరివిల్లులా తీర్చిదిద్దింది వైజయంతి మూవీస్‌. గత చిత్రాల్లాగే ఈ సినిమాలోనూ భారీతనం ఉట్టిపడింది. మణిశర్మ అందించిన పాటల్లో రెండు గీతాలు బాగున్నాయి. అన్ని పాటలను చిత్రీకరించిన విధానం బాగుంది. కథపరంగా ఎలాంటి మలుపులు లేని చిత్రం. కానీ, సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానంలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
బలాలు 
+ నాగ్‌, నాని
+ రెండు పాటలు
+ భావోద్వేగపు సన్నివేశాలు
బలహీనతలు 
- రొటీన్‌ కథ
చివరిగా: 'దేవ.. దాస్‌'..ఇద్దరూ నవ్విస్తారు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

--మాగల్ఫ్ రేటింగ్:3/5

Back to Top