అలా జరిగితే శబరిమల ఆలయాన్ని శాశ్వతంగా మూసేస్తాం..

- October 19, 2018 , by Maagulf
అలా జరిగితే శబరిమల ఆలయాన్ని శాశ్వతంగా మూసేస్తాం..

కేరళ:శబరిమలలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి… ఎలాగైనా ఆలయంలోకి ప్రవేశించాలనుకున్న ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు దుస్తుల్లో శిరస్త్రాణం ధరించి దేవుడి సన్నిధానాన్ని చేరుకునేందుకు ప్రయత్నించారు. వారికి బందోబస్తుగా 300 మంది పోలీసులు వచ్చారు. గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉన్న 18 మెట్ల దారికి 500 మీటర్ల దూరం వరకూ వచ్చిన మహిళా భక్తులు.. నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో వెనుదిరిగారు.

హైదరాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ కవిత, అయ్యప్ప మాల ధరించిన మరో మహిళ ఇరుముడితో ఆలయాన్ని చేరుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ ప్రధాన ఆలయానికి 4.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ క్యాంపు నుంచి గురువారం బయల్దేరారు. తీరా ఆలయ సమీపానికి చేరుకున్న ఇద్దరినీ అడ్డుకొని మెట్ల దారిలో పదుల సంఖ్యలో ఆలయ పూజారులు కూర్చొని భజనలు చేశారు. మహిళలను అనుమతించి ఆలయన ఆచారాలు మంటగలపొద్దని నినాదాలు చేశారు.

అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే, ఆలయానికి తాళం వేస్తామని, తాళంచెవులను అప్పగించి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదు అని, భక్తుల వైపున తాను నిలబడనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో తన వద్ద ఎటువంటి ఆప్షన్ లేదన్నారు.

ప్రధాన అర్చకుల హెచ్చరికతో వెనుదిరిగారు మహిళలు. ఇదో సాంప్రదాయ విధ్వంసంగా మారిందని ఐజీ శ్రీజిత్ అభిప్రాయపడ్డారు. ఇద్దరు మహిళలను గుడి వరకు తీసుకువెళ్లామని, కానీ దర్శనం మాత్రం అర్చకుడి ఆధీనంలో ఉంటుందని, ఆయన అనుమతి ఇస్తేనే దర్శనం జరుగుతుందని ఐజీ శ్రీజిత్ అన్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన మహిళలకు రక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాము సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికే వచ్చామని స్పష్టం చేశారు.

అయ్యప్ప కొండపైకి రావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు మహిళా జర్నలిస్ట్‌ కవిత. అక్కడ చిన్న పిల్లలు ఉన్నందువల్లే తాను వెనక్కి వచ్చేశానని స్పష్టంచేశారు. కొండపైకి వెళ్లే అంశంలో తాను గెలిచానని మాత్రం గర్వంగా చెప్పగలనని, తప్పకుండా కొన్ని రోజుల తర్వాత మళ్లీ తాను శబరిమలకు వస్తానని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com