సినీ గేయ రచయిత కులశేఖర్‌ అరెస్టు

- October 28, 2018 , by Maagulf
సినీ గేయ రచయిత కులశేఖర్‌ అరెస్టు

ఓ పూజారికి సంబంధించిన సంచిని చోరీ చేసిన కేసులో సినీ గేయ రచయిత కులశేఖర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంసమీపంలోని సింహాచలానికి చెందిన తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్‌(47) హైదరాబాద్‌ మోతీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఆర్బీఐ క్వార్టర్స్‌ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలోని పూజారి చేతి సంచి చోరీ చేశాడు. శ్రీనగర్‌కాలనీలోని ఓ ఆలయంవద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆదివారం ఆయన్ను అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్‌ డీఐ రవికుమార్‌ తెలిపారు. నిందితుని నుంచి రూ.50వేల విలువైన 10సెల్‌ఫోన్‌లు, రూ.45వేలవిలువైన చేతిసంచులు, కొన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ఆయన్ను రిమాండుకు తరలించినట్లు తెలిపారు. వందకు పైగా సినిమాలకు కులశేఖర్‌ పాటలు రాశాడు. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమై చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు జైలుశిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్‌ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరం పెట్టింది. బ్రాహ్మణుల మీద కులశేఖర్‌ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com