నిలువెత్తు సాక్ష్యం...!!

- December 21, 2015 , by Maagulf

నేస్తం...
పలకరించి చాలా రోజులయినా నువ్వు నా పక్కనే ఉన్నావన్న అనుభూతి... " అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదనడానికి " నిలువెత్తు సాక్ష్యం నువ్వే కదా... సభ దిగ్విజయంగా జరగడానికి అనుబంధాలు, అభిమానాలు ఒకదానికి ఒకటి పోటి పడ్డాయి... పెట్టని ఆభరణమైన ఆత్మీయత ఎక్కడ చూసినా కనువిందు చేసింది... నా అక్షరాలకు సార్ధకత చేకూరినట్లు అనిపించినా ఏదో చిన్న వెలితి నన్ను వెన్నాడుతోంది... నిజాయితీ లేని స్నేహం చేస్తూ... అవసరానికి నటిస్తూ డాలర్లలో/డబ్బులో జీవితాన్ని చూసుకుంటూ సమయమే లేదంటూ కాలాన్ని కావలి కాస్తున్నామనే భ్రమలో క్షణాలకు బంధీలై చెలిమిలో మమతకు చరమ గీతం పాడుతున్నామన్న సంగతిని మరచి పోతున్నారు... అమ్మను, అమ్మ భాషను ఎద్దేవా చేసే వారికి స్నేహం ఒక లెక్కా అంటావా ... అది నిజమే మరి.. నాది అత్యాశ కదూ...
ఈ మద్య కాలంలో కాస్త మత్తులో పడివున్న అక్షరాలను వెలికి తెద్దామంటే ఒకరంటారు కవిత్వమంటే మీరనుకునే మది పడే ఓ బాధా వీచిక కాదు.. ఆకలేసినా ఆనందం అక్షరాల్లో కనిపించాలి అంటారు.. కాలే కడుపుకి ఆకలి కేకలే కవిత్వంగా అంకురిస్తాయి కాని కలువల అందాలు, చందమామ చక్కదనాలు, ఆకాశంలో ఊహల హార్మ్యాలు అవతరించవు కదా... మనసు మమేకకమైన భావనలో నుండి జీవమున్న కవిత జనిస్తుందన్నది నా అభిప్రాయం మాత్రమే... ఎందుకంటే సిద్దాంతాలు, పరిణితులు, పరిపక్వత వంటి పెద్ద మాటల కవిత్వాలు నాకు తెలియదు... ఏదో నాకొచ్చిన నాలుగు పదాలతో నాలుగు వచనాల కవితలే అనుకోండి రాద్దామనుకుంటే ఇన్ని లక్షణాలు చెప్తున్నారు కనీసం ఒక్కటీ తెలియదాయే మరి నే కవిత అనుకున్న రూపంలో రాయాలా వద్దా అని ఎటు తేలని సందిగ్ధం... అవార్డులు రివార్డులు ఆశించేంత అత్యాశ లేదు... నాలుగు వచనాలు రాసుకోనిస్తే వాటికో నాలుగు లైకులు వస్తే చాలు... రాకపోయినా పర్లేదు...
మరో విషయం నాకు నా మాతృ భాషే సరిగా రాదు అలాంటప్పుడు పరాయి భాషలలో ప్రావీణ్యం ఎలా సంపాదించగలను..? అందుకే అమ్మ భాషలోనే ప్రయత్నాలు చేస్తున్నా... తప్పయినా ఒప్పయినా సరిదిద్దుకోవచ్చని... మమకారం అనేది మనం పెంచుకుంటే రాదు స్వతహాగా కొందరికి దేవుడు ఇచ్చిన వరం.. అది భాష మీదైనా... బంధాలపైనైనా... కొందరు ఆంగ్లంలో బాగా రాస్తారు... మరి కొందరు తెలుగు ఇలా ఎవరికి నచ్చిన భాషలో వారు భావాన్ని వ్యక్తీకరిస్తారు... దానిలో తప్పేం లేదు ఎవరి భాష వారిది కానీ ఎక్కడా ఒకరినొకరు కించ పరచుకోరు... మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కవిత్వాన్ని అది వచన కవిత్వాన్ని మరీ చిన్నచూపు చూడటం... ఒక పుస్తకం వేయాలంటే దాని ఆవిష్కరణకి కనీసం ఆ ఆవిష్కరణకు రావడానికి దానిలో నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా వ్యాపార పరంగా లాభాన్ని ఆలోచించే కొందరు మేధావుల చేతుల్లో రాను రాను భాష, భాషను నమ్ముకున్న సాహిత్యం ఏమవనుందో అని ఒకింత భయంగా ఉంది... !!

 

--మంజు యనమదల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com