గర్వించతగ్గ ఇండియన్ సినిమా 2.0 - రజనీకాంత్
- November 27, 2018
2.0 చిత్రం కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ప్రధాన పాత్రధారులుగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ సమర్పణలో సుభాష్‌కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, నేనూ పూర్తి సినిమా చూడలేదు. ప్రేక్షకాభిమానుల మాదిరిగానే నేనూ ఈ సినిమా చూడాలని విడుదల సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. గతంలో రోబో చిత్రం చేసినపుడు దానిని 3డి టెక్నాలజీలోకి మారుద్దామని అప్పట్లో ప్రయత్నించాం. ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని టూడీలో నుంచి త్రీడీలోనికి మార్చి చూశాం. చాలా గొప్పగా అనిపించింది. దాంతో ఒక మంచి సబ్జెక్టు దొరికితే నేరుగా త్రీడీ సినిమా తీస్తా అని శంకర్ నాతో అన్నారు. నాలుగేళ్ల క్రితం ఈ కథ చెప్పారు. అది సాధ్యమవుతుందా అన్న ప్రశ్న నాకు తలెత్తలేదు. ఈ కథ 3డి సినిమాకు చాలా కరెక్ట్ అనుకున్నాం. బాహుబలి విజయానికి కథే ప్రధాన బలం. ఈ సినిమా కూడా సాంకేతికతతో కూడిన మంచి కథ. నిర్మాత సుభాష్ కరణ్ ఎక్కడా రాజీపడలేదు. శంకర్ అనుకున్న విజన్‌ను సాధించడానికి ఆయన పూర్తి సహకారాన్ని అందించడం వల్లే ఇంత అద్భుతమైన సినిమా రూపొందింది. శంకర్ మెజీషియన్. అతను తన మేజిక్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇది అందరూ గర్వించదగ్గ ఇండియన్ సినిమా అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా ఘనతను చాటేవిధంగా ఉంటుంది. 1975లో నా మొదటి సినిమా విడుదల సమయంలో ఎలా ఉంటుందోనని ఎంత ఆతృతగా ఎదురు చూశానో.43 ఏళ్ల కెరీర్ తర్వాత మళ్లి ఈ సినిమా కోసం అంతే ఆతృతగా ఉన్నాను. ఈ సినిమాకు పబ్లిసిటీ అవసరమే లేదు. ఎందుకంటే ప్రేక్షకాభిమానులే దీనికి మంచి పబ్లిసిటీని ఇస్తున్నారు. విడుదల తర్వాత చూసినవాళ్లే మళ్లి మళ్లి చూస్తారు. ఆ విషయాన్ని అందరికీ చెపుతారు. దర్శకుడు శంకర్ చెబుతున్నట్లు ఈ సినిమాను 3డి టెక్నాలజీలోనే చూడాలి. అలా చూసినపుడు ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. పలు విషయాలను సందేశాత్మకంగా ఇందులో శంకర్ ఛూపారు. శంకర్ ఏది అనుకున్నారో దానిని తెరపైకి తీసుకురాగల సత్తా ఆయనకు ఉంది. దాదాపు 45 శాతం విజువల్ ఎఫెక్ట్స్ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక తెలుగు ప్రజల విషయానికి వస్తే.తెలుగు వారు చాలా మంచివారు. తెలుగు భోజనం, తెలుగు వారి ఆప్యాయత చాలా గొప్పగా ఉంటాయి. ఈ చిత్రాన్ని వారంతా చాలా గొప్పగా ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉంది అని అన్నారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన తర్వాత మేం పడ్డ కష్టం అర్థమౌతుంది. ఈ సినిమా పూర్తి ఎఫెక్ట్ తెలియాలంటే 4డి సౌండ్ సిస్టమ్‌లోనో, త్రీడీలోనో చూడాలి. 2డి కంటే పదిరెట్లు ఎక్కువ అనుభూతి 3డి వల్ల కలుగుతుంది. ఈ చిత్రంలో థ్రిల్లర్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలే కాదు మాస్, క్లాస్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే అన్ని అంశాలున్నాయి. ముఖ్యంగా మంచి సందేశం ఉంది. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ తమ పాత్రలలో ఎంతగానో ఒదిగిపోవడమే కాదు వారి మేకప్ వేసుకునేందుకు గంటల సమయాన్ని వెచ్చించారు. వేలాది మంది సాంకేతిక నిపుణుల అహర్నిశలు పనిచేశారు. అందరి సహకారం వల్లే నేను అనుకున్న సినిమాను తెరపైకి తీసుకుని రాగలుగుతున్నా అని అన్నారు.
నటుడు అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ, నేను ఈ సినిమా చేయడం ఓ స్కూల్‌కు వెళ్లినట్లుగా అనుకుంటున్నాను. మా స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్. ఆయన నిర్దేశకత్వంలో ఇలాంటి గొప్ప సినిమాను చేయగలిగాను. నా 28 ఏళ్ల సినీ కెరీర్ అంతా ఒక ఎత్తయితే. ఈ సినిమా ఒక ఎత్తు. కెరీర్ మొత్తం అనుభవమంతా ఈ ఒక్క సినిమాకే వచ్చేసింది. ఈ సినిమా చేసేటప్పుడు రజనీకాంత్ పంచ్‌లను ఎంతో ఎంజాయ్ చేశాను. విలన్‌గా నేను ఆయనతో తన్నులు తినడాన్ని గౌరవంగా భావించాను. నేను ఈ సిినిమాను అందరిలాగే ఇంకా చూడలేదు. నేను సినిమా కోసం ఆతృతగా ఉన్నా అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన దిల్‌రాజు మాట్లాడుతూ, నేను. ఎన్.వి.ప్రసాద్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా ఖ్యాతిని ఈ చిత్రం చాటి చెబుతుంది అని అన్నారు.
మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ, నాలుగేళ్ల శంకర్ తపనకు ఈ చిత్రం అద్దంపడుతుంది. దీపావళి పండుగ మళ్లి ఈ చిత్రం విడుదల తేదీ అయిన ఈ నెల 29న మరోసారి వస్తుంది. అప్పట్నుంచి 2.0 దీపావళి కొనసాగింపు సంక్రాంతికి కూడా కొనసాగుతుంది అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!