ఉత్పత్తి తగ్గింపునకు OPEC నిర్ణయం

- December 08, 2018 , by Maagulf
ఉత్పత్తి తగ్గింపునకు OPEC నిర్ణయం

వియన్నా: చమురు ధరల నియంత్రణలో భాగంగా రోజువారి చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే చమురు ఉత్పత్తి చేసే నాన్‌-ఒపెక్‌ దేశం రష్యా తన ఉత్పత్తిని ఏ మేరకు తగ్గిస్తుందన్న అంశంపై వివరణకు తాము ఎదురుచూస్తున్నట్లు ఒపెక్‌ నేతలు చెబుతున్నారు. చమురు ఉత్పత్తి తగ్గింపు అంశంపై అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చించేందుకు రష్యా ఇంథన శాఖ మంత్రి అలెగ్జాండర్‌ నోవాక్‌ శుక్రవారం వియన్నా నుండి స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో చర్చల అనంతరం నోవాక్‌ తిరిగి వియన్నాకు చేరుకుని ఒపెక్‌ దేశాలతో ఈ అంశంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని చమురును చౌకధరలకు అందచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్టోబర్‌లో ఒపెక్‌ దేశాలను డిమాండ్‌ చేసినప్పటి నుండి క్రూడాయిల్‌ ధర వరుసగా మూడుసార్లు పతనమైంది. ఈ అంశంపై శనివారం నాటికి తుది నిర్ణయానికి వస్తామని భావిస్తున్నట్లు సౌదీ ఇంథన శాఖ మంత్రి ఖాలిద్‌ అల్‌ ఫాలీ మీడియాకు చెప్పారు. చమురు ఉత్పత్తి విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతే అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ ముందు అనేక అవకాశాలున్నాయన్నారు. ఒపెక్‌ దేశాలు, మిత్ర దేశాలు తమ చమురు ఉత్పత్తిని 0.5- 1.5 మిలియన్‌ బ్యారెళ్ల స్థాయికి లేదా మిలియన్‌ బ్యారెళ్ల స్థాయికి తగ్గించాలన్న ప్రతిపాదన ఆమోదయోగ్యంగా వుంటుందని ఆయన చెప్పారు.

వత్తిడి పెంచిన ట్రంప్‌ 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై తాజా ఆంక్షలు విధించటంతో ఆ దేశం నుండి చమురు ఎగుమతులు పడిపోయాయి. అయితే ఇరాన్‌ క్రూడాయిల్‌ కొనుగోలు చేసే కొన్ని దేశాలకు అమెరికా ఈ ఆంక్షల నుండి మినహాయింపునివ్వటం విశేషం. 
మోడీ వంటి నేతల అభిప్రాయాలను గమనంలోకి తీసుకుంటాం : సౌదీ మంత్రి ఖలీద్‌ వెల్లడి
క్షీణిస్తున్న చమురు ధరలను నియంత్రించేందుకు వీలుగా చమురు ఉత్పత్తిని తగ్గించడంపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ వంటి ప్రపంచ నేతల అభిప్రాయాలను ఒపెక్‌ పరిగణనలోకి తీసుకుంటుందని సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీ తెలిపారు. ప్రపంచంలోనే చమురు వినియోగంలో మూడవ అతిపెద్ద దేశం భారత్‌. దేశ ఇంధన అవసరాలు తీర్చేందుకు 80శాతంపైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఒపెక్‌ సమావేశం నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడుతూ సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్‌, జి-20 సమావేశం సందర్భంగా బ్యూనస్‌ ఎయిర్స్‌లో మోడీని కలిశామని, ఆయన తన అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పారని, తమ దేశ వినియోగదారుల ప్రయోజనాల పట్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. చమురు ధరలు అధికంగా పెరిగేలా నిర్ణయాలను ఒపెక్‌ తీసుకోబోదని ఆశిస్తున్నట్లు ఒపెక్‌ సమావేశానికి ముందు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దానిపై ఖలీద్‌ స్పందిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద వినిమయ దేశమైన అమెరికా అలా ఆశించడంలో పొరపాటు లేదని అన్నారు. అతిపెద్ద వినిమయ దేశాలు వాస్తవంగా సమావేశాల్లో పాల్గొనకపోయినా ఒపెక్‌ చర్చల్లో భాగస్వాములై వుంటాయని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com