లక్జెంబర్గ్‌:బస్సు, రైలు, మెట్రో.. ఏదెక్కినా ఫ్రీ..

- December 08, 2018 , by Maagulf
లక్జెంబర్గ్‌:బస్సు, రైలు, మెట్రో.. ఏదెక్కినా ఫ్రీ..

లక్జెంబర్గ్‌:ఎంత హాయి.. బస్సెక్కగానే పర్సులో చేయిపెట్టి చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పన్లేదు. కండక్టర్ ప్రయాణీకుల మధ్యలోనుంచి టిక్కెట్.. టిక్కెట్ అంటూ తోసుకుని రావాల్సిన పని అంతకంటే లేదు. ఇదేదో మనదేశంలో కూడా పెడితే ఎంత బావుండు అని అనిపిస్తోంది కదూ.

ప్చ్.. అంత భాగ్యం మనకు లేదు. రవాణా సంస్థ నష్టాల్లో ఉందంటూ ప్రయాణీకులపై భారాన్ని మోపడానికే చూస్తుంటాయి ఇక్కడి ప్రభుత్వాలు. ఫ్రీ అక్కర్లేదు బాబూ. కనీసం రద్దీ మార్గాల్లో తగినన్ని బస్సులు వేస్తే అదే పదివేలు అని కదా అనుకునేది.

ఇంతకీ ఫ్రీ ఎక్కడనుకుంటున్నారు.. యూరోప్ కంట్రీస్‌లో ఒకటైన లక్జెంబర్గ్‌లో.. మామూలుగానే అక్కడ రవాణా చార్జీలు చాలా తక్కువ. త్వరలోనే అధికారం చేపట్టనున్న సంకీర్ణ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఈ శుభవార్త చెప్పింది. వచ్చే వేసవి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశం లక్జెంబర్గ్‌ కావడం విశేషం. ఇంతకు ముందు రెండు గంటల ప్రయాణానికి రెండు డాలర్లు వసూలు చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఈ చిన్న దేశంలో ఎక్కడికి వెళ్లాలన్న రెండు గంటల కంటే ఎక్కువ ప్రయాణం ఉండదు.

ఇక్కడి ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థపై ఏడాదికి బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7వేల కోట్లకు పైనే) ఖర్చు చేస్తోంది. కానీ ప్రజల నుంచి సంస్థకు వచ్చే ఆదాయం అందులో మూడో వంతు మాత్రమే. ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసి ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది. ఇంతకీ ఇక్కడ జనాభా ఎంతంటే.. ఆరు లక్షల మంది మాత్రమే. అయితే ప్రతి రోజూ ఇక్కడికి వివిధ పనుల నిమిత్తంగా పక్క దేశాల నుంచి వచ్చే వారు రెండు లక్షల మంది వరకు ఉంటారట. ఈసారి విదేశీ విహార యాత్రల లిస్టులో లక్జెంబర్గ్‌ చేరిస్తే సరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com