బ్రిటన్ ప్రధానిపై అవిశ్వాసం

- December 13, 2018 , by Maagulf
బ్రిటన్ ప్రధానిపై అవిశ్వాసం

లండన్‌ : బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే తన నాయకత్వంపై అవిశ్వాసం ఎదుర్కోనున్నారు. డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఇచ్చిన ఒక ప్రకటనలో ''ఈ పోటీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతానని'' థెరిసా మే చెప్పారు. వచ్చే ఏడాది మార్చి29న ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి ( బ్రెగ్జిట్‌) ఆర్టికల్‌-50ని కొత్త ప్రధాని కొట్టివేయడం లేదా పొడిగిస్తారని ఆమె అన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఎంపీలు బ్రిటన్‌ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 మధ్య తమ ఓటు వేయనున్నారు. కన్జర్వేటివ్‌ నేతను మార్చడం వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, అనిశ్చితి ఏర్పడుతుందని, దాన్ని ఇప్పుడు భరించలేమని మే అన్నారు. 2016లో బ్రిటన్‌ ఈయూ నుంచి వైదొలగాలని రిఫరెండమ్‌ ముగిసిన కొద్ది రోజులకే థెరిసా మే ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తన బ్రెగ్జిట్‌ ప్రణాళికతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న అవిశ్వాసం ఫలితాలు ఎంత త్వరగా వెలువడతాయి అనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే, దీనిలో గెలవాలంటే థెరిసా మే తన ఆధిక్యం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే మరో ఏడాది వరకూ ఆమె ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉండదు. ఒకవేళ థెరిసా మే అవిశ్వాసంలో ఓడిపోయినట్టయితే కొత్త నేతను ఎన్నుకోడానికి జరిగే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి వీలుండదు. భారీ మెజారిటీతో గెలవకపోయినా, పార్టీ నేత పదవి నుంచి తానే తప్పుకోవాలని థెరిసా మే నిర్ణయించుకోవచ్చు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని అతిపెద్ద పార్టీ కన్జర్వేటివ్‌ కావడంతో ఆ పార్టీ నేతగా ఉన్నవారు ప్రధాని అవుతారు. ఒకవేళ థెరిసాను కన్జర్వేటివ్‌ నేతగా తొలగించినట్టయితే పార్టీ తర్వాత కొత్త నేతను ఎన్నుకునేంత వరకు ఆమె ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ఈ ప్రక్రియకు ఆరు వారాల సమయం పడుతుంది. అభ్యర్థులు ఒకరికి మించి ఉంటే ఎంపీలు తమ ఓట్ల ద్వారా ఇద్దరిని ఎన్నుకుని వారిని ఓటింగ్‌కు పంపుతారు.
పార్టీ నాయకత్వం కోసం చూస్తున్నామని, ఓటింగ్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న సర్‌ గ్రాహమ్‌ బ్రాడీ, బాక్‌ బెంచ్‌ టోరీస్‌ చైర్మెన్‌ తెలిపారు. వారసుడు వచ్చే వరకూ థెరిసా ప్రధాని పదవిలో కొనసాగుతారని అన్నారు. అవిశ్వాసం ఎదుర్కోవాల్సి ఉంటుందని మంగళవారం సాయంత్రమే ప్రధానికి స్పష్టం చేసినట్టు గ్రాహమ్‌ తెలిపారు. వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం లభిస్తుందని ఆమె ఆసక్తిగా ఉన్నారని అన్నారు. థెరిసా మే స్థానంలో కొత్తవారు రావడానికి జనవరి లేదా ఫిబ్రవరి వరకు సమయం పట్టవచ్చని, బ్రెగ్జిట్‌పై చర్చలు జరిపేందుకు ఈయూను మరింత సమయం కోరాల్సి ఉంటుందని జస్టిస్‌ సెక్రెటరీ డేవిడ్‌ గౌకె మీడియాతో అన్నారు. 'మే ఈ రాత్రి అవిశ్వాసంలో ఓటమి పాలైనట్టయితే ప్రధానిగా ఎవరుంటారో వారు ఆర్టికల్‌ 50ని ఆలస్యం చేయాల్సి ఉంటుంది. మార్చి 29న మేం ఎలా బయటపడగలమో మాకు తెలియడం లేదు' అన్నారు. అవిశ్వాసంపై 48 లేఖలు రావడంపై తాను నిరాశ చెందినట్టు గౌకే అన్నారు. రాత్రి జరిగే అవిశ్వాస ఓటింగ్‌లో ప్రధాని భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీక్రెట్‌ బ్యాలెట్‌తో అవిశ్వాసం 
ప్రధాని అవిశ్వాసం ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్రెగ్జిట్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదముందని థెరిసా మే మద్దతుదారులు భావిస్తున్నారు. ప్రధానికి మద్దతు ఇవ్వాలని మంత్రులు ట్వీట్స్‌ చేస్తున్నారు. కానీ అది సీక్రెట్‌ బ్యాలెట్‌ కావడంతో వాళ్లు ఆమెకు ఓటు వేసి మద్దతిచ్చారనడానికి అక్కడ ఎలాంటి సంకేతం కనిపించే అవకాశం లేదు. ఈయూ నుంచి వైదొలిగే ఒప్పందానికి మార్పులు చేయడంలో భాగంగా బుధవారం తర్వాత ప్రధాని మే ఐరిష్‌ ప్రీమియర్‌ లియో వారడ్కర్‌ను డబ్లిన్‌లో కలవాల్సి ఉంది. అవిశ్వాసం ఓటింగ్‌లో తన నాయకత్వం కోసం పోరాడేందుకు ఆ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు థెరీసా మే తెలిపారు. మంగళవారం థెరిసా మే మిగతా ఈయూ నేతలతో కూడా చర్చలు జరిపారు. ఒప్పందంపై మరో దఫా చర్చలు జరపలేమని వారు ఆమెతో కరాఖండిగా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com