2019లోనే ముఖ్యమంత్రిని కావొచ్చు : పవన్ కళ్యాణ్

- December 16, 2018 , by Maagulf
2019లోనే ముఖ్యమంత్రిని కావొచ్చు : పవన్ కళ్యాణ్

డల్లాస్(అమెరికా): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి మరోసారి సీఎం అనే పదం వినిపించింది. 2019లోనే తాను సీఎం కావొచ్చని పవన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని పవన్.. డల్లాస్‌లో ''జనసేన ప్రవాస గర్జన''లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు, వ్యవస్థ గురించి ప్రస్తావించారు. తన లక్ష్యం గురించి వివరించారు. అన్నింటికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. భారత రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకురావాలన్నారు. మనం అనుకుంటే మార్పు సాధ్యం అన్నారు. మార్పు కోసం తన ప్రాణం పణంగా పెట్టడానికి కూడా సిద్ధమే అని చెప్పారు. తనకు సీఎం పదవి కంటే దేశాన్ని, వ్యవస్థను మార్చాలన్నదే ముఖ్యం అన్నారు. ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలన్నారు. దేశం కోసం 25ఏళ్లు పని చేయడానికి సిద్ధమన్నారు. మార్పు అధికారంలో ఉన్నప్పడే వస్తుందన్నారు. వ్యవస్థ దారి తప్పడానికి పాలకులు నీతి తప్పడమే కారణం అని పవన్ ఆరోపించారు. రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించి ఏం చేస్తారని ప్రశ్నించారు. చివరకు 6 అడుగుల గొయ్యి తప్ప మరేమీ మిగలదన్నారు.

నా దగ్గర పేపర్లు, ఛానెల్స్ లేవన్నారు. రాజకీయాలకు గొప్ప తెలివితేటలు అక్కర్లేదని చెప్పారు. తాను పార్టీ ఫండ్ కోసం అమెరికాకి రాలేదని చెప్పారు. తాను ఆత్మగౌరవంతో బతికేవాడిని అని, డబ్బు వదులుకున్న వాడిని అని, కోట్లు వస్తే కోట్లు ఇచ్చేసిన వాడిని అని చెప్పారు. ఈరోజుకి సినిమా చేస్తే ఊహించినంత డబ్బు వస్తుందన్నారు.

భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే ప్రణాళికలు రచిస్తున్నామని పవన్ చెప్పారు. రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ వాటిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న సక్సెస్ కోసం తాను 12 ఏళ్లు వెయిట్ చేశానని తెలిపిన పవన్.. అలాంటిది సమాజంలో మార్పు కోసం 25ఏళ్లు వేచి చూడటానికి సిద్ధమన్నారు. తాను ఆశావాదిని అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com