ఆందోళనకు సిద్దమవుతున్న ఫ్రెంచ్‌ పోలీసు యూనియన్లు

- December 21, 2018 , by Maagulf
ఆందోళనకు సిద్దమవుతున్న ఫ్రెంచ్‌ పోలీసు యూనియన్లు

పారిస్‌ : ఫ్రాన్స్‌ను అట్టుడికిస్తున్న 'యెల్లో వెస్ట్స్‌' ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి పోలీసులు కూడా తోడవుతున్నారు. తక్కువ వేతనాలు, పనిభారంతో విసిగిపోతున్నామంటూ ఫ్రెంచ్‌ పోలీసు యూనియన్లు యెల్లో వెస్ట్స్‌తో కలసి ఆందోళనలో భాగస్వాములయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్రెంచ్‌ పోలీసు యూనియన్‌ ప్రతినిధి లాయిక్‌ ట్రావెర్స్‌ బుధవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ యూనిఫారం (విధినిర్వహణ)లో లేని అధికారులు తమ సమస్యల పరిష్కారం కోసం యెల్లో వెస్ట్స్‌బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. యెల్లో వెస్ట్స్‌ నిరసనకారుల ఆందోళనను తాము గుర్తించామని, తాముకూడా సమస్యల పరిష్కారానికి ఇదే బాటలో నడవాలనుకుంటున్నామని ఆయన వివరించారు. పోలీసు దళాల్లోని సభ్యులందరూ మధ్యతరగతి,దిగువ మధ్య తరగతి శ్రేణికిచెందిన వారేనని, వారి వేతనాలు, పని పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల లేకపోటంతో తమసహచరులు కొంతమంది యెల్లో వెస్ట్స్‌ బాట పట్టాలని నిర్ణయించుకున్నారని ట్రావెర్స్‌ వివరించారు. యెల్లో వెస్ట్స్‌ ఆందోళనకు మూలకారణం పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలి వున్నదని ఆయన చెప్పారు. దేశంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు పోలీసులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారని, యెల్లోవెస్ట్స్‌ డిమాండ్‌తో తాము కూడా ప్రభావితమవుతున్నామని ఆల్టర్నేటివ్‌ పోలీస్‌ ప్రతినిధి డెన్నిస్‌ జాకబ్‌ వివరించారు. అపరిష్కృతంగావున్న తమ సమస్యల పరిష్కారానికి పోలీసు యూనియన్లు ఫ్రెంచ్‌ హోం మంత్రి క్రిసోఫర్‌ కాస్టనర్‌తో చర్చలు కొనసాగాస్తున్నాయి.

యెల్లో వెస్ట్స్‌ ఆందోళనతో విధులను నిర్వర్తించిన పోలీసులకు 300 యూరోల బోనస్‌ను ప్రభుత్వం ఆఫర్‌ చేసినప్పటికీ అది సరిపోదని తమకు 2.3 కోట్ల గంటల ఓవర్‌టైమ్‌ భత్యాలను చెలించాలని పోలీసు యూనియన్లు డిమాండ్‌ చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com