వేలానికి సిద్ధమవుతున్న హాయ్‌లాండ్..కోర్టు హాల్ లోనే ఓపెన్ ఆక్షన్‌

- December 22, 2018 , by Maagulf
వేలానికి సిద్ధమవుతున్న హాయ్‌లాండ్..కోర్టు హాల్ లోనే ఓపెన్ ఆక్షన్‌

అగ్రిగోల్డ్ కేసులోహైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హాయ్‌లాండ్‌ను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది.కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించా లని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. ఫిబ్రవరి 8న కోర్టు హాల్‌లోనే ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

హైకోర్టు కీలక నిర్ణయం..
ఎంతో కాలంగా వివాదంలో ఉన్న హాయ్‌లాండ్ వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో..పాటు వేలం నిర్వహణ పైనా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. హాయ్‌లాండ్‌ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీ ఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించాయి. హాయ్‌లాండ్‌ విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందని యాజమా న్యం కోర్టుకు తెలపడంతో.. హాయ్‌లాండ్‌ను వేలం వేయాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హాయ్‌లాండ్‌లో కొంతభాగం గతంలోనే ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున.. ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి.. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని హైకోర్టు పేర్కొంది.

కోర్టు హాల్‌లోనే ఓపెన్‌ ఆక్షన్ ..
ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుపై తొలుత ముందుకొచ్చిన జీఎస్‌ఎల్‌ గ్రూపు ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌ ప్రతిపాదన ఉపసంహరణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయం లో కోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని, అప్పడే బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com