ట్రిపుల్‌ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం

- December 27, 2018 , by Maagulf
ట్రిపుల్‌ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం

ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదం పొందింది. క్రిస్మస్‌ సెలవుల అనంతరం గురువారం పున్ణప్రారంభమైన శీతాకాల సమావేశాలు వాడీవేడీ చర్చతో మొదలయ్యాయి. సున్నితమైన మత సంప్రదాయాలకు సంబంధించిన ఇలాంటి బిల్లులపై విస్తృతాభిప్రాయం అవసరమనీ, బిల్లును ఉభయ సభల జాయింట్‌ సెలక్టు కమిటీకి నివేదించాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. దీనికి ససేమిరా అంటూ ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం మొండిగా తిరస్కరించింది. కాంగ్రెస్‌, అన్నాడిఎంకె, తృణముల్‌ కాంగ్రెస్‌, బిజెడి, సిపిఎం, సిపిఐ, ఆరెస్పీ, ఎన్సీపి, ఆర్జేడి, ఎస్పీ, ఐయుఎంఎల్‌, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌, ఎంఐఎం, టిడిపి, టిఆర్‌ఎస్‌ తదితర పార్టీల సభ్యులు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లును సెలక్టు కమిటీకి నివేదించాలని డిమాండ్‌ చేశాయి. దానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాంగ్రెస్‌, అన్నాడిఎంకె, టిఎంసి తదితర పార్టీలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. అనంతరం సభలో ఉన్న ప్రతిపక్షాల సభ్యులు బిల్లుపై ఓటింగ్‌ కోరుతూ డివిజన్‌ కోరాయి. బిల్లుకు అనుకూలంగా 238 (అయిస్‌) ఓట్లు, వ్యతిరేకిస్తూ 12 (నోస్‌) ఓట్లు నమోదయ్యాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ప్రకటించారు.

గురువారం లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఈ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని, మానవతా దఅక్పథంతో పరిశీలించాలని అన్నారు. ఈ బిల్లు ఏ కులానికీ, మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఇది మైనారిటీ మహిళల హక్కు, వారికి న్యాయానికి సంబంధించినదని అంటూ, బిల్లుపై చర్చకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు త్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశాయన్నారు. బిల్లులో అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని ఆయన సభకు తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చాలా ముఖ్యమైనదని, రాజ్యాంగపరమైన అంశాలతో కూడుకున్నందున దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. రాజ్యాంగంలోని 13 (2), 14, 15, 21, 29 అధికరణల ఉల్లంఘన జరుగుతోందని, ఒక మతానికి సంబంధించిన విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని చట్టం చేయడం ఎంతవరకు సరైనదో తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే ఈ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఆయన కోరారు. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్నదే ప్రతిపక్షాల ఏకాభిప్రాయమని తఅణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సందీప్‌ బందోపాధ్యాయ అన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు.. ఎవరినీ పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. స్పీకర్‌ విచక్షణ అధికారాలు ఉపయోగించి దీన్ని జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వ్యభిచారం, హోమోసెక్సువాలిటీ నేరం కాదని సుప్రీం కోర్టు చెప్పడాన్ని సమస్యగా పరిగణించనివారు ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. భార్యకు అన్యాయం చేసే హిందూ భర్తకు కేవలం ఒక ఏడాది మాత్రమే శిక్ష విధించే అవకాశం ఉందని, అయితే అదే నేరం చేసిన ముస్లిం భర్తకు మూడేళ్ళ జైలు శిక్ష ఎందుకు విధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మతం ఆధారంగా శబరిమల తీర్పును వ్యతిరేకిస్తున్నారని, ముస్లిం మతం విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. ఇస్లాం ప్రకారం వివాహం ఓ కాంట్రాక్టు అని, భర్త తన భార్యకు విడాకులివ్వాలనుకుంటే మూడుసార్లు మెహర్‌ ఇవ్వాలని నిఖానామాలో పేర్కొంటారని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ను సింగిల్‌ తలాక్‌గా పరిగణించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఆరెస్పీ ఎంపి ప్రేమ్‌ చంద్రన్‌ స్పష్టం చేశారు. ఈ బిల్లులో రాజకీయ ప్రయోజనాలే కనబడుతున్నాయని ఆయన విమర్శించారు. బిల్లును చట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోందని ఆయన ఆక్షేపించారు. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీం కోర్టు మైనార్టీ తీర్పు(2:3) ఇచ్చిందని, శబరిమల విషయంలో మెజార్టీ(4:1) తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో తొందరపడినట్లు, శబరిమలపై ఎందుకు ఆర్డినెన్స్‌ తీసుకురాలేదని విమర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com