రాజధాని నిర్మాణ మాస్టర్‌ప్లాన్‌ను శనివారం విడుదల..

- December 25, 2015 , by Maagulf
రాజధాని నిర్మాణ  మాస్టర్‌ప్లాన్‌ను శనివారం విడుదల..

సీఎం క్యాంపు కార్యాలయమే వేదిక.. పూర్తయిన తుది మెరుగులు.. సీఆర్డీయే వెబ్‌సైట్‌లో పెట్టనున్న అధికారులు ఎన్నారైల సలహాలు స్వీకరణకు నిర్ణయం విజయవాడ,  ఏపీ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రాజధాని నిర్మాణ బృహత ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)ను శనివారం విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితం సర్బానా ప్రతినిధుల నుంచి సీఆర్డీఏ కమిషనర్‌కు చేరిన మాస్టర్‌ ప్లానకు ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే అవసరమైన రీతిలో స్వల్ప మార్పులను చేసినట్లు సమాచారం. మాస్టర్‌ ప్లానను సీఆర్డీఏ కమిషనర్‌సహా ఇద్దరు అదనపు కమిషనర్లు ప్రత్యేకంగా హైదరాబాద్‌ వెళ్లి సీఎం చంద్రబాబుకు చూపించారు. మాస్టర్‌ ప్లాన్‌లో సీఎం అవసరమైన మార్పులను సూచించినట్లు సమాచారం. వీటికనుగుణంగా సీఆర్డీఏ కమిషనర్‌, ప్లానింగ్‌, డెవల్‌పమెంట్‌ విభాగాలతో పాటు పలువురు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలిసింది. శనివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాస్టర్‌ప్లాన్‌ను సీఎం చేతులు మీదుగా విడుదల చేయనున్నారు. సీఎం విడుదల చేయనున్న మాస్టర్‌ ప్లానతో రాజధానిలోగవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లు, ముఖ్య రహదారులు, కోర్‌ క్యాపిటల్‌ తదితర నిర్మాణాలు ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో రానున్నాయనే విషయాలపై స్పష్టత రానుంది. వెబ్‌సైట్‌లో మాస్టర్‌ప్లాన్‌ రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై దేశ,విదేశాల్లో ఉన్న తెలుగువారి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీఆర్డీయే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను మాస్టర్‌ప్లాన్‌ ప్రతిని సీఆర్డీయే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌పై రాజధానివాసుల్లో అవగాహన కల్పించేందుకుగాను సీఆర్డీయే అధికారులు మాస్టర్‌ప్లాన్‌ ప్రతిని సీఆర్డీయే ముఖ్య కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా దీన్ని అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 30వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com