భారత్:ఇజ్రాయెల్‌ నుంచి మరో 15 హరోప్‌ డ్రోన్లు కొనుగోలుకు సన్నాహాలు

- January 27, 2019 , by Maagulf
భారత్:ఇజ్రాయెల్‌ నుంచి మరో 15 హరోప్‌ డ్రోన్లు కొనుగోలుకు సన్నాహాలు

ఢిల్లీ: భారత రక్షణ బలగాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా మరో 15 మానవరహిత యుద్ధ విమానాల(డ్రోన్‌) కొనుగోలుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ తరహా డ్రోన్‌ల తయారీలో పేరుగాంచిన ఇజ్రాయెల్‌ నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హరోప్‌ రకానికి చెందిన డ్రోన్‌లను పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రో ఆప్టికల్‌ సెన్సార్‌లతో పనిచేసే ఈ తరహా విమానాలు శత్రు స్థావరాలపై దాడికి ఉపయోగకరంగా ఉంటాయి. దాడి చేయడానికి ముందు లక్ష్యం చేసిన పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఇవి ఎంతో తోడ్పాటును అందిస్తాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
'హరోప్‌ డ్రోన్‌ల కొనుగోలు ప్రతిపాదనలపై వచ్చే వారం జరిగే రక్షణశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. వీటి చేరికతో మానవరహిత యుద్ధ విమానాల విషయంలో భారత్‌ మరింత బలోపేతమవుతుంది' అని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హెరాన్‌, సెర్చర్‌ తరహా డ్రోన్‌లను అందిస్తున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు హరోప్‌ డ్రోన్‌లను కూడా భారత్‌కు అందించనుందన్నారు. దీంతో పాటు 'చీతా' ప్రాజెక్టు అమలుపై సైతం చర్చించనున్నామన్నారు. ఇప్పటికే ఉన్న డ్రోన్‌లకు మరింత సాంకేతికతను జోడించి భారత ఆయుధ సంపత్తిని బలోపేతం చేయడమే ప్రాజెక్టు చీతా అని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వాటి నిఘా, దాడి సామర్థ్యాలను పెంచనున్నామన్నారు. ఇప్పటికి 100 మానవరహిత యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో ఉన్నాయి. ప్రాజెక్టు అనంతరం దేశీయంగా డ్రోన్ల తయారీపై సైతం దృష్టి సారిస్తామని వివరించారు.

అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌లోని పలు లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా మానవరహిత యుద్ధ విమానాలను విరివిగా వాడుతోంది. లాడెన్‌ అంతమొందించడానికి ముందు అతని కదలికలపై నిఘా కోసం అమెరికా డ్రోన్‌లను ఉపయోగించిందని అప్పట్లో వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com